మత్తయి 26:20-25

మత్తయి 26:20-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

సాయంకాలమైనప్పుడు, ఆయన పన్నెండు మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. వారు భోజనం చేస్తూవుండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు. అందుకు వారు చాలా దుఃఖపడి, “ప్రభువా, నేనైతే కాదు కదా?” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనను అడగడం మొదలుపెట్టారు. అందుకు యేసు, “నాతో పాటు గిన్నెలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు. అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:20-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు. ఆయన, “నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు. మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది” అని వారితో చెప్పాడు. ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:20-25 పవిత్ర బైబిల్ (TERV)

సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు. అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు. మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు. అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” అని సమాధానం చెప్పాడు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:20-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను. వారు భోజనముచేయుచుండగా ఆయన–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యిముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన–నీవన్నట్టే అనెను.

షేర్ చేయి
Read మత్తయి 26