మత్తయి 26:1-75

మత్తయి 26:1-75 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో, “మీకు తెలిసినట్లు, పస్కాకు ఇంకా రెండు రోజులున్నాయి, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాడు” అని చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు. వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు. కాని పండుగ సమయంలో వద్దు, “జనాల మధ్య అల్లరి కలుగుతుందేమో” అని చెప్పుకున్నారు. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు, ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తలమీద ఆ పరిమళద్రవ్యంను పోసింది. శిష్యులు అది చూసి కోప్పడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు. యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు. అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి, “నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు. వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు పట్టణంలో ఫలాన వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతనితో, బోధకుడు ఇలా అన్నాడు: నా సమయం దగ్గరకు వచ్చింది. నేను నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కాను ఆచరిస్తాను అని చెప్పమన్నాడు అని చెప్పండి” అన్నారు. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు. సాయంకాలమైనప్పుడు, ఆయన పన్నెండుమంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. వారు భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు. అందుకు వారు చాలా దుఃఖపడి, “ప్రభువా, నేనైతే కాదు కదా?” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనను అడగడం మొదలుపెట్టారు. అందుకు యేసు, “నాతో పాటు గిన్నెలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు. అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకుని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు. తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి. ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము. నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.” వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు. అప్పుడు యేసు వారితో, “నన్ను బట్టి ఈ రాత్రి మీరందరు చెదరిపోతారు ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు మందలోని గొర్రెలు చెదిరిపోతాయి.’ కాని నేను తిరిగి లేచిన తర్వాత, మీకంటే ముందు గలిలయకు వెళ్తాను” అన్నారు. అందుకు పేతురు, “అందరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నేను నిన్ను విడువను” అన్నాడు. అందుకు యేసు అతనితో, “ఈ రాత్రి కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. కాని పేతురు యేసుతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో నాకు తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరు కూడా అలాగే అన్నారు. ఆ తర్వాత యేసు తన శిష్యులతో కూడ గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, ఆయన వారితో, “నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని అన్నారు. ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుతూ బాధపడసాగారు. ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పారు. కొంత దూరం వెళ్లి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు” అని ప్రార్థించారు. యేసు తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “ఒక గంటయైనా నాతో మెలకువగా ఉండలేరా?” అని అడిగి, “మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు. ఆయన రెండవసారి వెళ్లి ప్రార్థించారు, “నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే తప్ప ఇది నా దగ్గరి నుండి తొలగిపోవడం సాధ్యం కానట్లైతే, నీ చిత్తమే నెరవేర్చు.” ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్లు బరువుగా ఉన్నాయి, కాబట్టి వారు మళ్ళీ నిద్రపోతున్నారని గమనించారు. కాబట్టి ఆయన మరొకసారి వారిని విడిచివెళ్లి, ఆ మాటలనే పలుకుతూ మూడవసారి ప్రార్థించారు. అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు ప్రజానాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది. ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి” యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా, నీకు శుభం” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు. అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేశాడు. యేసు వానితో, “నీ కత్తిని దాని ఒరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే, ఆయన పన్నెండు దళాల సైన్యం కంటే ఎక్కువ మంది దూతలను వెంటనే నాకు పంపడని అనుకున్నావా? కాని, ఈ విధంగా జరగాలని లేఖనాల్లో చెప్పబడినవి ఎలా నెరవేరుతాయి?” అని అన్నారు. ఆ సమయంలోనే యేసు ఆ గుంపుతో, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు, మీరు నన్ను బంధించలేదు. అయితే ప్రవక్తలు వ్రాసిన లేఖనాలు నెరవేరడానికే ఈ విధంగా జరిగింది” అని చెప్పారు. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయారు. యేసును బంధించినవారు ఆయనను ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదా నాయకులు సమావేశమై ఉన్నారు. అయితే పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. లోపల ఏమి జరుగుతుందో చూడాలని అక్కడే సైనికులతో కూర్చున్నాడు. ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు. చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు. చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు. వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.” అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు. అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు. అందుకు యేసు, “నీవు చెప్పినట్లే. అయితే ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.” అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. వారు, “ఇతనికి మరణశిక్ష విధించాలి” అని సమాధానం ఇచ్చారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి, “క్రీస్తు, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు” అన్నారు. పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. “నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే” అన్నది. అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అన్నాడు. తర్వాత అతడు ద్వారం వైపు వెళ్లాడు, అక్కడ మరొక దాసియైన అమ్మాయి అతన్ని చూసి అక్కడ ఉండిన ప్రజలతో, “ఇతడు నజరేయుడైన యేసుతో ఉన్నవాడే” అని చెప్పింది. పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు. కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు. అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, “అతని గురించి నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే కోడి కూసింది. “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:1-75 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో, “రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు” అని చెప్పాడు. ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు. వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు. అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు. యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది. అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం! దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు. యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది. బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.” అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. “యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు. అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?” అని అడిగారు. అందుకాయన, “మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను, అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి” అన్నాడు. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు. సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు. ఆయన, “నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు. మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది” అని వారితో చెప్పాడు. ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే, ‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా! కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అన్నాడు. అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు. యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు. పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు. ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. ఆయన, “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి” అని వారితో చెప్పాడు. పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు. అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు. ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు. శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు. యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు. ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి. ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు. అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది. ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.” ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు. వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు. అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు. తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు. పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు. ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు. అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది? మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు. పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు. అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు. కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది. “ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:1-75 పవిత్ర బైబిల్ (TERV)

యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో “రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు. ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధానయాజకుని యింటి ఆవరణంలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు” అని అనుకొన్నారు. బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది. ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు. యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. ఇది సత్యం — ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు. ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. “ఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకొన్నారు?” అని వాళ్ళనడిగాడు. వాళ్ళు ముప్పై వెండి నాణెములు లెక్క పెట్టి యిచ్చారు. అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు?” అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో ‘నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాలనుకొంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు’ అని చెప్పండి.” శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు. సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు. అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు. మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు. అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు. ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి. ఇది నా ఒడంబడిక రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను. ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు. వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్ళారు. ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు నా కారణంగా చెదరిపోతారు. ఎందుకంటే: ‘నేను గొఱ్ఱెల కాపరిని చంపుతాను అప్పుడా గొఱ్ఱెల మంద చెదరిపోతుంది’ అని వ్రాయబడివుంది. కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా ముందే గలిలయకు వెళ్తాను” అని అన్నాడు. పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు. యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లు అంటావు” అని సమాధానం చెప్పాడు. కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు. ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను” అని అన్నాడు. యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది. అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు. యేసు యింకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి, “నా తండ్రి! వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవలసింది నా యిచ్ఛకాదు, నీది” అని అంటూ ప్రార్థించాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేవు మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు. “మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు. ఆయన రెండవసారి వెళ్ళి, “నా తండ్రీ! ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని ప్రార్ధించాడు. ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటంవల్ల వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు. ఆయన మూడవ సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్ళీ ప్రార్ధించాడు. ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది. వెళ్దాం, లేవండి. అదిగో! నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు!” అని అన్నాడు. ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు. యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” అని ఆయన్ని ముద్దుపెట్టుకున్నాడు. యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు. యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు. యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు. నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు. ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు. కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు. వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు. కాని పేతురు కొంత దూరంలోవుండి యేసును ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి యింటి ముగింట్లో కూర్చున్నాడు. మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు. చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.” అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు. కాని యేసు సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు. యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు. ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా! మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి “ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు. ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, “నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!” అని అడిగింది. కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు. ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది. పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు. కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు. అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది. అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:1-75 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి –రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయముచేతపట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లు–పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. శిష్యులు చూచి కోపపడి–ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలిసి కొని–ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను. ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి –నేనాయ నను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి–పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడి గిరి. అందుకాయన–మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతోకూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను. వారు భోజనముచేయుచుండగా ఆయన–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యిముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన–నీవన్నట్టే అనెను. వారు భోజనముచేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి –మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి–దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి. అప్పుడు యేసు వారిని చూచి–ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా– గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెదననెను. అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి. అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి–నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసుమరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి, సాగిలపడి– నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి–బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి–దీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను. ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి –వీడు దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి. ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారు–వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతులతో కొట్టి – క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి. పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా అనెను. అందుకతడు– నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టుపెట్టుకొని–నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి–నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు– ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక–కోడి కూయకమునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:1-75 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)