మత్తయి 25:31-45

మత్తయి 25:31-45 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మనుష్యకుమారుడు తన మహిమలో, దేవదూతలందరితో వచ్చేటప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. భూప్రజలందరు ఆయన ముందు పోగు చేయబడి ఉంటారు, ఒక గొర్రెల కాపరి మేకల నుండి గొర్రెలను వేరు చేసినట్లు ఆయన వారిని వేరు చేస్తాడు. ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కోసం సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు. నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు. “అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము? ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము? ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు. “అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు. “అప్పుడు ఆయన తన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది వాని దూతల కోసం సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి. ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చలేదు, నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకోలేదు, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగిగా చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు’ అని చెప్తాడు. “అందుకు వారు, ‘ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలితో ఉండడం లేదా దాహంతో ఉండడం లేదా పరదేశిగా ఉండడం లేదా బట్టలు లేనివానిగా ఉండడం లేదా రోగిగా లేదా చెరసాలలో ఉండడం చూసి సహాయం చేయలేదు?’ అడుగుతారు. “అందుకు రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.

మత్తయి 25:31-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు. అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు. “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు. అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు.

మత్తయి 25:31-45 పవిత్ర బైబిల్ (TERV)

“తేజోవంతుడైన మనుష్యకుమారుడు తన దేవదూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు. ప్రజలందర్ని సమావేశ పరచి గొఱ్ఱెల కాపరి మేకల్లో నుండి గొఱ్ఱెల్ని వేరు చేసినట్లు వాళ్ళను వేరుచేస్తాడు. తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు. “అప్పుడా రాజు తన కుడి వైపునున్న వాళ్ళతో, ‘రండి! నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకొండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు. దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు. “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు. “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు. “ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ వైపునున్న వాళ్ళతో, ‘శాపగ్రస్తులారా! వెళ్ళి పొండి! సైతాను కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి. ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు’ అని అంటాడు. “అప్పుడు వాళ్ళు కూడా, ‘ప్రభూ! మీరు ఆకలిగావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చెయ్యలేదు?’ అని అంటారు. “ఆయన, ‘ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం చెయ్యనట్లే’ అని చెబుతాడు.

మత్తయి 25:31-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును–ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివైయుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన–మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.