మత్తయి 25:16-30
మత్తయి 25:16-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఐదు తలాంతుల బంగారం తీసికొనిన వాడు వెంటనే వెళ్లి వెంటనే ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఇంకా ఐదు తలాంతులను సంపాదించాడు. అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. అయితే ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు మాత్రం వెళ్లి, భూమిలో ఒక గుంట త్రవ్వి దానిలో తన యజమానుని ఇచ్చిన ఒక్క తలాంతును దాచిపెట్టాడు. “చాలాకాలం తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు. ఐదు తలాంతుల బంగారం తీసికొన్నవాడు ఇంకా ఐదు తలాంతులు తెచ్చి, ‘యజమానుడా, నీవు నాకు ఐదు తలాంతుల బంగారం అప్పగించావు. చూడు, నేను ఇంకా ఐదు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు. “అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కనుక నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు. “అలాగే రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు కూడా వచ్చాడు. అతడు ‘యజమానుడా, నీవు నాకు రెండు తలాంతుల బంగారం అప్పగించావు; చూడు, నేను ఇంకా రెండు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు. “అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కనుక నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు. “ఆ తర్వాత ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు వచ్చి, ‘యజమానుడా, నీవు కఠినుడవని, విత్తనాలు విత్తని చోట పంట కోసేవాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకొనే వాడవని నాకు తెలుసు. కనుక నేను భయపడి వెళ్లి, నీ తలాంతు బంగారాన్ని భూమిలో దాచి పెట్టాను’ అని చెప్పాడు. “అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకొనే వాడనని నీకు తెలుసు కదా? అలాగైతే, నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టాల్సింది, అప్పుడు నేను వచ్చి దానిని వడ్డితో కలిపి తీసుకొనేవాడిని’ అన్నాడు. “ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకొని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. ఎందుకంటే కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగివుంటాడు. లేనివారి నుండి, వారు కలిగివున్నది కూడా తీసివేయబడుతుంది. అయితే పనికిమాలిన ఈ దాసుని బయటకు చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”
మత్తయి 25:16-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు. అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు. “చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు. అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి ‘అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. అతని యజమాని, ‘ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ‘అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడన్నాడు, ‘అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు. కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసుకోండి’ అన్నాడు. అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా! అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి, ‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి. ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.
మత్తయి 25:16-30 పవిత్ర బైబిల్ (TERV)
ఐదు తలాంతులు పొందిన వాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి మరో ఐదు తలాంతులు సంపాదించాడు. అదేవిధంగా రెండు తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో రెండు తలాంతులు సంపాదించాడు. కాని ఒక తలాంతు పొందిన వాడు వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వి యజమాని యిచ్చిన ధనాన్ని అందులో దాచాడు. “చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసాడు. ఐదు తలాంతులు పొందినవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి, ‘అయ్యా! మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు. నేను మరో ఐదు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు. “ఆ యజమాని ‘మంచి పని చేసావు! నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు! కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలసి ఆనందించు!’ అని సమాధానం చెప్పాడు. “రెండు తలాంతులు పొందిన వాడు కూడా వచ్చి, ‘అయ్యా! నాకు రెండు తలాంతులు యిచ్చారు. నేను మరో రెండు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు. “ఆ యజమాని, ‘మంచి పని చేసావు! నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు కనుక నిన్ను యింకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను, నీ యజమానితో కలసి ఆనందించు!’ అని అన్నాడు. “తదుపరి ఒక తలాంతు పొందినవాడు వచ్చి ‘అయ్యా! మీరు కృరమైన వారని నాకు తెలుసు. విత్తనం నాటని చోట మీరు పంటను కోస్తారు. విత్తనం వేయని పొలాలనుండి ధాన్యం ప్రోగు చేస్తారు. అందువల్ల నేను భయపడి మీ తలాంతు తీసుకు వెళ్ళి భూమిలో దాచి ఉంచాను. ఇదిగో! మీది మీరు తీసుకోండి!’ అని అన్నాడు. “ఆ యజమాని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ‘నీవు దుర్మార్గుడివి! సోమరివి! నేను విత్తనం నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం వెయ్యని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసునన్న మాట. అలా అనుకొన్నవాడివి నా డబ్బు వడ్డీ వ్యాపారుల దగ్గర దాచి ఉంచ వలసింది. అలా చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది.’ “అతని దగ్గరున్న తలాంతు తీసుకొని పది తలాంతులున్న వానికివ్వండి. ఎందుకంటే ఉన్న వాళ్ళకు దేవుడు యింకా ఎక్కువ యిస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళనుండి వాళ్ళ దగ్గరున్నది కూడా తీసి వేయబడుతుంది. ఆ పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధననుభవిస్తాడు.
మత్తయి 25:16-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి – అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి –ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.