మత్తయి 24:1-31
మత్తయి 24:1-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించారు. అందుకు యేసు, “మీరు ఇవన్నీ చూస్తున్నారా? ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు. యేసు ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు, తన శిష్యులు ఆయన దగ్గరకు ఒంటరిగా వచ్చారు. వారు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు యుగాంతం కావడానికి సూచనలు ఏమైనా కనబడతాయా?” మాకు చెప్పుమని అడిగారు. యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కాని మీరు కలవరపడకుండ జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం వెంటనే రాదు. జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే. “అప్పుడు హింసించబడడానికి మరణానికి మీరు అప్పగించబడతారు, నన్ను బట్టి మీరు అన్ని రాజ్యాలచేత ద్వేషించబడతారు. ఆ సమయంలో అనేకులు తమ నమ్మకాన్ని వదులుకొని ఒకరినొకరు ద్వేషించుకొని మోసగించుకుంటారు. అప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎంతోమందిని మోసపరుస్తారు. దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది. కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది. “కాబట్టి ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ పరిశుద్ధ స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, చదివేవాడు అర్థం చేసుకొనును గాక. అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. ఇంటిపైన ఉన్నవారెవరు క్రిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేన్ని బయటకు తీసుకురాకూడదు. పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు. ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! అందుకే చలికాలంలో కాని సబ్బాతు దినాన కాని పారిపోయే పరిస్థితి రాకుండా ప్రార్థించండి. ఎందుకంటే లోకం సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమ రాలేదు. మరి ఎప్పటికీ రాదు. “ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు, అయితే ఎన్నుకోబడినవారి కోసం ఆ రోజులు తగ్గించబడతాయి. ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే, నమ్మకండి. ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి గొప్ప సూచకక్రియలను, అద్భుతాలను చేస్తారు. చూడండి, ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను. “కాబట్టి ఎవరైనా, ‘ఇదిగో, ఆయన అరణ్యంలో ఉన్నాడు’ అని మీతో చెబితే, వెళ్లకండి; లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ, లోపలి గదిలో ఉన్నాడు’ అని చెప్పితే నమ్మకండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో, అలాగే మనుష్యకుమారుని రాకడ ఉంటుంది. ఎక్కడ పీనుగు ఉంటే అక్కడ గద్దలు పోగవుతాయి. “ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు. గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయనచేత ఎన్నుకోబడిన వారిని పోగుచేస్తారు.
మత్తయి 24:1-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు. అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు. ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు. అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే. “అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు. ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు. అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు. అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది. రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది. “కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక), యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు. పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు. అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం. అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు. ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు. “ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు. ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను. కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు. “మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది. శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి. “ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి. అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు. ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.
మత్తయి 24:1-31 పవిత్ర బైబిల్ (TERV)
యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు. యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు. యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట. “ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది. “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు. “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు. “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు. “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. చూడండి! ముందే మీకు చెబుతున్నాను. “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి. “ఆ కష్టకాలం గడిచిన వెంటనే, ‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు. చంద్రుడు వెలుగునివ్వడు నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.
మత్తయి 24:1-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన – మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములనుగూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే – చదువువాడు గ్రహించుగాక– యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; పొలములోఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను – ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. కాబట్టి ఎవరైనను–ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.
మత్తయి 24:1-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)