మత్తయి 23:13-39
మత్తయి 23:13-39 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! కనుక మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు. [వారు విధవరాళ్ళ గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు.] “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! ఒక్కడిని మీ మతంలో కలుపుకోడానికి, మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు, వాడు మీ మతంలో కలిసిన తర్వాత, వానిని మీకంటే రెండంతలు ఎక్కువ నరకానికి పాత్రునిగా చేస్తారు. “వివేచనలేని గ్రుడ్డి మార్గదర్శకులారా మీకు శ్రమ! మీరంటున్నారు, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు; కాని దేవాలయ బంగారం తోడు అని ఒట్టు పెట్టుకొంటే వాడు దానికి కట్టుబడి ఉండాలి’ అని. గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేక బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా? అలాగే, ‘ఒకడు బలిపీఠం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు, కాని బలిపీఠం మీది అర్పణ తోడని ఒట్టు పెట్టుకొంటే దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెప్తారు. గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేక అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? కాబట్టి, ఎవడైనను బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొంటే దాని మీద ఉన్న వాటన్నిటి తోడు అని ఒట్టు పెట్టుకొంటున్నాడు. మరియు ఎవడైన దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొంటే అందులో నివసించే వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు. అలాగే పరలోకం తోడని ఒట్టు పెట్టుకొనే వాడు దేవుని సింహాసనం తోడని దాని మీద కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను పదవ భాగం ఇస్తున్నారు. కాని ధర్మశాస్త్రంలోని చాలా ముఖ్యమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం వంటి వాటిని నిర్లక్ష్యం చేశారు. మీరు మొదటివాటిని నిర్లక్ష్యం చేయకుండ, వెనుకటివాటిని పాటించాల్సింది. గ్రుడ్డి మార్గదర్శకులారా! మీరు చిన్న దోమను వడగడతారు కాని ఒంటెను మ్రింగుతారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు గిన్నెను, పాత్రను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, స్వీయ సంతృప్తితో నిండి ఉన్నారు. గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపలి భాగాన్ని శుభ్రపరచండి, అప్పుడు బయట కూడా శుభ్రంగా ఉంటుంది. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. అవి బయటకు అందంగా అలంకరించబడి లోపల చచ్చిన వారి ఎముకలతోను, కుళ్ళుపట్టిన శవం ఉంటుంది. అలాగే మీరు బయట మనుష్యులకు నీతిమంతులుగా కనబడతారు కాని, లోపల వేషధారణ మరియు దుష్టత్వంతో నిండి ఉన్నారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, నీతిమంతుల సమాధులను అలంకరిస్తున్నారు. ఇంకా మీరు, ‘మేము మా పితరుల దినాల్లో ఉండివుంటే, ప్రవక్తల రక్తాన్ని చిందించడంలో వారితో కలిసేవారం కామని’ చెప్పుకొంటారు. ఈ విధంగా మీరు ప్రవక్తలను చంపిన మీరూ వారి సంతానమే అని మీకు మీరే సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి, ఇక మీ పితరులు ఆరంభించిన పనిని పూర్తి చేయండి. “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు? అందుకే నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, బోధకులను పంపిస్తున్నాను. వారిలో కొందరిని మీరు చంపి సిలువ వేస్తారు; ఇంకొందరిని ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తరిమి మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టిస్తారు. నీతిమంతుడు హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం మరియు దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల నిరపరాధ రక్తదోషం అంతా మీ మీదికి వస్తుంది. ఇవన్ని ఈ తరం వారి మీదికే వస్తాయి అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపావు మరియు నీ దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టినదానా, ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా చేర్చుకొంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నోసార్లు చేర్చుకోవాలని అనుకున్నాను కాని నీవు అంగీకరించలేదు. చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది. ‘ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!’ అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.
మత్తయి 23:13-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు. మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు. “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు. బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా? అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు. అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి. అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి. అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు. “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు. ‘మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము’ అని చెప్పుకొంటారు. నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు. ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి. “సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు. కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు. నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది. అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను. “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు. ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”
మత్తయి 23:13-39 పవిత్ర బైబిల్ (TERV)
“శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు. “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా? “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా! “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి! “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు. “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి. “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”
మత్తయి 23:13-39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనముతోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు –మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీపితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచునుఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది. ఇదిమొదలుకొని– ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.