మత్తయి 23:1-28
మత్తయి 23:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను –శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక–వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనముతోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.
మత్తయి 23:1-28 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు యేసు జనసమూహాలతో మరియు తన శిష్యులతో, “ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు మోషే అధికార పీఠం మీద కూర్చున్నారు. కనుక వారు మీతో చెప్పే వాటన్నిటినీ జాగ్రత్తగా అనుసరించండి. కాని వారు చేసే క్రియలను చేయకండి, ఎందుకంటే వారు బోధించే వాటిని పాటించరు. వారు మోయలేనంత బరువులను కట్టి, మనుష్యుల భుజాల మీద పెడతారు, కాని తమ ఒక చేతి వ్రేలితో కూడా వాటిని కదలించడానికి ఇష్టపడరు. “వారు చేసే ప్రతిదీ మనుష్యులకు చూపించడానికే చేస్తారు: అనగా వారు తమ నొసటి మీద కట్టుకునే దేవుని వాక్యం కలిగిన రక్షకరేకులను వెడల్పుగాను వస్త్రాలకుండే కుచ్చులు పొడవుగాను చేసుకుంటారు. వారు విందుల్లో గౌరవప్రదమైన స్థలాన్ని, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను, సంత వీధుల్లో గౌరవ వందనం పొందాలని మరియు ‘రబ్బీ’ అని పిలువబడానికి ఇష్టపడతారు. “కానీ మీరు ‘రబ్బీ’ అని పిలిపించుకోవద్దు, ఎందుకంటే మీరందరు అన్నదమ్ములు, మీకు ఒక్కడే బోధకుడున్నాడు. మీరు భూమి మీద ఎవరిని ‘తండ్రి’ అని పిలువద్దు ఎందుకంటే మీకు ఒక్కరే తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. మీరు ‘గురువులు’ అని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు, ఆయన క్రీస్తు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు దాసుడై ఉండాలి. ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనేవారు తగ్గింపబడతారు, తనను తాను తగ్గించుకొనేవారు హెచ్చింపబడతారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! కనుక మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు. [వారు విధవరాళ్ళ గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు.] “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! ఒక్కడిని మీ మతంలో కలుపుకోడానికి, మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు, వాడు మీ మతంలో కలిసిన తర్వాత, వానిని మీకంటే రెండంతలు ఎక్కువ నరకానికి పాత్రునిగా చేస్తారు. “వివేచనలేని గ్రుడ్డి మార్గదర్శకులారా మీకు శ్రమ! మీరంటున్నారు, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు; కాని దేవాలయ బంగారం తోడు అని ఒట్టు పెట్టుకొంటే వాడు దానికి కట్టుబడి ఉండాలి’ అని. గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేక బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా? అలాగే, ‘ఒకడు బలిపీఠం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు, కాని బలిపీఠం మీది అర్పణ తోడని ఒట్టు పెట్టుకొంటే దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెప్తారు. గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేక అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? కాబట్టి, ఎవడైనను బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొంటే దాని మీద ఉన్న వాటన్నిటి తోడు అని ఒట్టు పెట్టుకొంటున్నాడు. మరియు ఎవడైన దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొంటే అందులో నివసించే వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు. అలాగే పరలోకం తోడని ఒట్టు పెట్టుకొనే వాడు దేవుని సింహాసనం తోడని దాని మీద కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను పదవ భాగం ఇస్తున్నారు. కాని ధర్మశాస్త్రంలోని చాలా ముఖ్యమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం వంటి వాటిని నిర్లక్ష్యం చేశారు. మీరు మొదటివాటిని నిర్లక్ష్యం చేయకుండ, వెనుకటివాటిని పాటించాల్సింది. గ్రుడ్డి మార్గదర్శకులారా! మీరు చిన్న దోమను వడగడతారు కాని ఒంటెను మ్రింగుతారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా మరియు పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు గిన్నెను, పాత్రను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, స్వీయ సంతృప్తితో నిండి ఉన్నారు. గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపలి భాగాన్ని శుభ్రపరచండి, అప్పుడు బయట కూడా శుభ్రంగా ఉంటుంది. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. అవి బయటకు అందంగా అలంకరించబడి లోపల చచ్చిన వారి ఎముకలతోను, కుళ్ళుపట్టిన శవం ఉంటుంది. అలాగే మీరు బయట మనుష్యులకు నీతిమంతులుగా కనబడతారు కాని, లోపల వేషధారణ మరియు దుష్టత్వంతో నిండి ఉన్నారు.
మత్తయి 23:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు. కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు. మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు. వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు. విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు. సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం. మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది. “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు. మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు. “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు. బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా? అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు. అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి. అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి. అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.
మత్తయి 23:1-28 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు. “పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు. “మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి. ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’ మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి. ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు. “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా? “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా! “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.
మత్తయి 23:1-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో, “ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు మోషే అధికార పీఠం మీద కూర్చున్నారు. కాబట్టి వారు మీతో చెప్పేవాటన్నిటిని జాగ్రత్తగా అనుసరించండి. కాని వారు చేసే క్రియలను చేయకండి, ఎందుకంటే వారు బోధించే వాటిని పాటించరు. వారు మోయలేనంత బరువులను కట్టి, మనుష్యుల భుజాల మీద పెడతారు, కాని తమ ఒక చేతి వ్రేలితో కూడా వాటిని కదిలించడానికి ఇష్టపడరు. “వారు చేసే ప్రతిదీ మనుష్యులకు చూపించడానికే చేస్తారు: అనగా వారు తమ నొసటి మీద కట్టుకునే దేవుని వాక్యం కలిగిన రక్షకరేకులను వెడల్పుగాను వస్త్రాలకుండే కుచ్చులు పొడవుగాను చేసుకుంటారు. వారు విందుల్లో గౌరవప్రదమైన స్థలాన్ని, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను, సంత వీధుల్లో గౌరవ వందనం పొందాలని ‘రబ్బీ’ అని పిలువబడానికి ఇష్టపడతారు. “కానీ మీరు ‘రబ్బీ’ అని పిలిపించుకోవద్దు, ఎందుకంటే మీరందరు అన్నదమ్ములు, మీకు ఒక్కడే బోధకుడున్నాడు. మీరు భూమి మీద ఎవరిని ‘తండ్రి’ అని పిలువద్దు ఎందుకంటే మీకు ఒక్కరే తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. మీరు ‘గురువులు’ అని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు, ఆయన క్రీస్తు. మీలో గొప్పవాడు మీకు దాసునిగా ఉండాలి. ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తనను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! కాబట్టి మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు. “వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! ఒక్కడిని మీ మతంలో కలుపుకోడానికి, మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు, వాడు మీ మతంలో కలిసిన తర్వాత, వానిని మీకంటే రెండంతలు ఎక్కువ నరకానికి పాత్రునిగా చేస్తారు. “వివేచనలేని గ్రుడ్డి మార్గదర్శకులారా మీకు శ్రమ! మీరంటున్నారు, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు; కాని దేవాలయ బంగారం తోడు అని ఒట్టు పెట్టుకొంటే వాడు దానికి కట్టుబడి ఉండాలి’ అని. గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేదా బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా? అలాగే, ‘ఒకడు బలిపీఠం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు, కాని బలిపీఠం మీది అర్పణ తోడని ఒట్టు పెట్టుకొంటే దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెప్తారు. గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? కాబట్టి, ఎవడైనను బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొంటే దాని మీద ఉన్న వాటన్నిటి తోడు అని ఒట్టు పెట్టుకొంటున్నాడు. ఎవడైన దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొంటే అందులో నివసించే వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు. అలాగే పరలోకం తోడని ఒట్టు పెట్టుకొనే వాడు దేవుని సింహాసనం తోడని దాని మీద కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను పదవ భాగం ఇస్తున్నారు. కాని ధర్మశాస్త్రంలోని చాలా ముఖ్యమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం వంటి వాటిని నిర్లక్ష్యం చేశారు. మీరు మొదటివాటిని నిర్లక్ష్యం చేయకుండ, వెనుకటివాటిని పాటించాల్సింది. గ్రుడ్డి మార్గదర్శకులారా! మీరు చిన్న దోమను వడగడతారు కాని ఒంటెను మ్రింగుతారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు గిన్నెను, పాత్రను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, స్వీయ సంతృప్తితో నిండి ఉన్నారు. గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపల శుద్ధిచేయాలి అప్పుడు బయట కూడా శుద్ధిగా ఉంటుంది. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. అవి బయటకు అందంగా కనిపించినా లోపల మృతుల ఎముకలతోను అపవిత్రమైన దానితో నిండి ఉన్నాయి. అలాగే మీరు బయట మనుష్యులకు నీతిమంతులుగా కనబడతారు కాని, లోపల వేషధారణ దుష్టత్వంతో నిండి ఉన్నారు.