మత్తయి 23:1-12
మత్తయి 23:1-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో, “ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు మోషే అధికార పీఠం మీద కూర్చున్నారు. కాబట్టి వారు మీతో చెప్పేవాటన్నిటిని జాగ్రత్తగా అనుసరించండి. కాని వారు చేసే క్రియలను చేయకండి, ఎందుకంటే వారు బోధించే వాటిని పాటించరు. వారు మోయలేనంత బరువులను కట్టి, మనుష్యుల భుజాల మీద పెడతారు, కాని తమ ఒక చేతి వ్రేలితో కూడా వాటిని కదిలించడానికి ఇష్టపడరు. “వారు చేసే ప్రతిదీ మనుష్యులకు చూపించడానికే చేస్తారు: అనగా వారు తమ నొసటి మీద కట్టుకునే దేవుని వాక్యం కలిగిన రక్షకరేకులను వెడల్పుగాను వస్త్రాలకుండే కుచ్చులు పొడవుగాను చేసుకుంటారు. వారు విందుల్లో గౌరవప్రదమైన స్థలాన్ని, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను, సంత వీధుల్లో గౌరవ వందనం పొందాలని ‘రబ్బీ’ అని పిలువబడానికి ఇష్టపడతారు. “కానీ మీరు ‘రబ్బీ’ అని పిలిపించుకోవద్దు, ఎందుకంటే మీరందరు అన్నదమ్ములు, మీకు ఒక్కడే బోధకుడున్నాడు. మీరు భూమి మీద ఎవరిని ‘తండ్రి’ అని పిలువద్దు ఎందుకంటే మీకు ఒక్కరే తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. మీరు ‘గురువులు’ అని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు, ఆయన క్రీస్తు. మీలో గొప్పవాడు మీకు దాసునిగా ఉండాలి. ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తనను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.
మత్తయి 23:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు. కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు. మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు. వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు. విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు. సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం. మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
మత్తయి 23:1-12 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు. “పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు. “మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి. ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’ మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి. ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు.
మత్తయి 23:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను –శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక–వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.