మత్తయి 22:1-46

మత్తయి 22:1-46 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు మరలా ఉపమానరీతిలో వారితో మాట్లాడుతూ, “పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారుని కోసం ఏర్పాటుచేసిన గొప్ప పెండ్లి విందును పోలి ఉంది. ఆ పెండ్లివిందుకు పిలువబడినవారిని రమ్మని పిలువడానికి అతడు తన పనివారిని పంపించాడు, కాని వారు రావడానికి తిరస్కరించారు. “కాబట్టి ఆయన ఆహ్వానించిన వారి దగ్గరకు మరికొందరు పనివారిని పంపించి, ‘ఇదిగో, నేను విందు సిద్ధపరిచాను: నా ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెండ్లివిందుకు రండి’ అని చెప్పమన్నాడు. “కానీ వారు అతని మాటలు లెక్కచేయకుండా ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఆ పిలుపును తెచ్చిన పనివారిని పట్టుకుని, అవమానించి వారిని చంపారు. కాబట్టి రాజు కోప్పడి తన సైన్యాన్ని పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. “అప్పుడు అతడు తన పనివారితో, ‘పెండ్లి విందు సిద్ధంగా ఉంది, గాని నేను పిలిచిన వారు యోగ్యులు కారు. కాబట్టి మీరు వీధి మూలలకు పోయి మీకు కనబడిన వారినందరిని పెండ్లివిందుకు ఆహ్వానించండి’ అని తన పనివారితో చెప్పాడు. ఆ పనివారు వీధులలోనికి పోయి తమకు కనబడిన చెడ్డవారిని, మంచివారిని అందరిని పోగుచేశారు, కాబట్టి ఆ పెండ్లి వేదిక అంతా విందుకు వచ్చిన అతిథులతో నిండిపోయింది. “కాని ఆ రాజు అతిథులను చూడడానికి లోపలికి వచ్చినప్పుడు, అక్కడ పెండ్లి వస్త్రాలను వేసుకోకుండా కూర్చున్న ఒకడు అతనికి కనిపించాడు. రాజు వానితో, ‘స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. వాడు మౌనంగా ఉండిపోయాడు. “అప్పుడు ఆ రాజు తన పనివారితో, ‘వీని చేతులు కాళ్లు కట్టి, బయట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి’ అని చెప్పారు. “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.” అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును తన మాటల్లోనే ఎలా చిక్కించాలని ఆలోచించారు. హేరోదీయులతో పాటు తమ అనుచరులను ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని, సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పు” అని అడిగారు. అయితే యేసు, వారి చెడు ఉద్దేశాన్ని గ్రహించి, వారితో, “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? పన్నుకట్టే ఒక నాణెము నాకు చూపించండి” అన్నారు. అందుకు వారు ఒక దేనారం తెచ్చారు. ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఆయనను విడిచి వెళ్లిపోయారు. పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు అదే రోజు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. “బోధకుడా, ఒకడు సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే చెప్పాడు. అలా మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. కాబట్టి అతని తమ్ముడు అతని విధవను చేసుకున్నాడు. అలాగే రెండవవాడు, మూడవవాడు, ఏడవ వాని వరకు అలాగే జరిగింది. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఆమెను వారందరు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు పడుతున్నారు. పునరుత్థానంలో ప్రజలు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. మృతుల పునరుత్థానం గురించి, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని చెప్పారు. జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని, పరిసయ్యులు అక్కడికి చేరుకున్నారు. వారిలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు, యేసును పరీక్షిస్తూ, “బోధకుడా, ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’ ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి.’ ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తల మాటలకు ఆధారంగా ఉన్నాయి” అని అతనితో చెప్పారు. పరిసయ్యులు ఒకచోట కూడి ఉన్నప్పుడు యేసు వారిని ఈ విధంగా అడిగారు, “క్రీస్తును గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అందుకు వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు. అందుకాయన, “అలాగైతే దావీదు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనను ‘ప్రభువు’ అని ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు ఇలా అన్నాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’ దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిస్తే, ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు. ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పలేకపోయారు, ఆ రోజు నుండి ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.

మత్తయి 22:1-46 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు, “పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు. అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు. కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు. కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు. ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది. “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.” అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు. వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు. సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు. యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు. ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, “బోధకా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు గదా. మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు. ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు. వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు. పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు. చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’ అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు. ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు. వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి, “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. అందుకు యేసు, “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే. ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ. ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే. ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు. మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని, “క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు. వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు. అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు. ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.

మత్తయి 22:1-46 పవిత్ర బైబిల్ (TERV)

యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు. “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు. “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు. మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు. ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు. “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు. వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు. ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది. “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు. ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు. “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు. ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు. వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు. మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు. యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు. ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు. అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?” యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.” ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు. యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి. ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’ ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.” పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు. “దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు, ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా, నా కుడి వైపు కూర్చో’ అని అనలేదా? దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?” ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.

మత్తయి 22:1-46 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడినవారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాగా అతడు–ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు–పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి –స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు –బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతోకూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు–కైసరువనిరి. అందుకాయన–ఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి. పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి – బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను; మాలో ఏడుగురు సహోదరు లుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. రెండవవాడును మూడవవాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు–లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు. మృతుల పునరుత్థానమునుగూర్చి–నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోప దేశకుడు ఆయనను శోధించుచు –బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందు కాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి –క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు– ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన–ఆలాగైతే –నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

మత్తయి 22:1-46 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)