మత్తయి 2:16-23
మత్తయి 2:16-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. అందువలన –రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై –నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలుదేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశమును ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
మత్తయి 2:16-23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ జ్ఞానులచే మోసపోయానని గ్రహించిన హేరోదు చాలా కోపంతో, జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయస్సుగల మగ పిల్లలందరిని చంపుమని ఆదేశించాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా పలికిన ఈ మాటలు నెరవేరాయి: “రామాలో ఏడ్పు, గొప్ప శోకం యొక్క, ఒక ధ్వని వినబడింది, రాహేలు తన సంతానం కొరకు ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.” హేరోదు చనిపోయిన తర్వాత, ఐగుప్తులో ఉన్న యోసేపుకు ప్రభువు దూత కలలో కనబడి అతనితో, “బాలుని ప్రాణం తీయాలని చూసినవారు చనిపోయారు, కాబట్టి నీవు లేచి, బాలున్ని, అతని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు” అని చెప్పాడు. కనుక యోసేపు లేచి, బాలున్ని, అతని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్లాడు. అయితే యూదయ ప్రాంతాన్ని అర్కెలా తన తండ్రియైన హేరోదు స్థానంలో పాలిస్తున్నాడని అతడు విని, అక్కడికి వెళ్లడానికి భయపడ్డాడు. కలలో దేవుని హెచ్చరిక పొంది, గలిలయ ప్రాంతానికి వెళ్లి, నజరేతు అనే ఊరిలో నివసించాడు. ఆయన నజరేయుడు అని పిలువబడుతాడు అని ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
మత్తయి 2:16-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు. “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది. రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి. హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి, “లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు. అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణీ తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకు వచ్చాడు. అయితే అర్కెలా తన తండ్రి హేరోదు స్థానంలో యూదయ ప్రాంతాన్ని పాలిస్తున్నాడని విని, అక్కడికి వెళ్ళడానికి యోసేపు భయపడ్డాడు. దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలిలయ ప్రాంతానికి వెళ్ళి, నజరేతు అనే ఊరిలో నివసించాడు. యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
మత్తయి 2:16-23 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు. తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది: “రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది. ఎవరు ఓదార్చిన వినలేదు. ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.” హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు. అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు. అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.