మత్తయి 2:1-15

మత్తయి 2:1-15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు, తూర్పు దిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. వారు, “యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చాము” అని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడు కలతచెందాడు, అతనితో పాటు యెరూషలేమంతా కలతచెందింది. హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉండింది అని వారిని అడిగాడు. అందుకు వారు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని చెప్పారు, “ఎందుకంటే ప్రవక్త ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు; ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి నీలో నుండి వస్తాడు.’” అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకొన్నాడు. ఆయన వారితో, “మీరు వెళ్లి ఆ శిశువు కొరకు జాగ్రత్తగా వెదకండి. మీరు అతన్ని కనుగొనగానే నాకు చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పి బేత్లెహేముకు పంపించాడు. వారు రాజు మాటలు విని, బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి నిలిచే వరకు వారి ముందు వెళ్తూ వుండింది. వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు చాలా ఆనందించారు. వారు ఆ ఇంట్లోకి వెళ్లి, ఆ శిశువు తన తల్లియైన మరియతో ఉండడం చూసి, వారు వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ ధనాగారాలు విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళంను అర్పించారు. వారు వెళ్లిపోవలసిన సమయంలో హేరోదు రాజు దగ్గరకు వెళ్లకూడదని కలలో హెచ్చరిక రావడంతో వారు మరో దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “ఈ శిశువును చంపాలని హేరోదు రాజు వెదుకుతున్నాడు కనుక నీవు శిశువును అతని తల్లిని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండు” అని చెప్పాడు. కనుక యోసేపు లేచి, ఆ రాత్రి సమయంలోనే శిశువును అతని తల్లి మరియను తీసుకొని ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్లాడు. హేరోదు మరణించే వరకు అక్కడే ఉన్నాడు. “ఐగుప్తులో నుండి నేను నా కుమారుని పిలిచాను” అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు నెరవేరాయి.

షేర్ చేయి
Read మత్తయి 2

మత్తయి 2:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి, “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు. హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు. కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే, ‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు. అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు. తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు. వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది. ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు. హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు. యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు. హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు. ‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’ అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.

షేర్ చేయి
Read మత్తయి 2

మత్తయి 2:1-15 పవిత్ర బైబిల్ (TERV)

హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు. ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు. అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు. వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు: “‘యూదయ దేశంలోని బేత్లెహేమా! నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు! ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు. ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’” ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు. వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు. ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు. హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు. యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను” అని అన్న మాట నిజమైంది.

షేర్ చేయి
Read మత్తయి 2

మత్తయి 2:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి –యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి – క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారు – యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని – మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమునవారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. వారు వెళ్లినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై–హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.

షేర్ చేయి
Read మత్తయి 2