మత్తయి 18:1-20
మత్తయి 18:1-20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ సమయంలోనే శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పరలోకరాజ్యంలో అందరికంటే గొప్పవాడెవరు?” అని అడిగారు. అప్పుడు యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలుచుకొని వారి మధ్యలో నిలబెట్టి ఈ విధంగా చెప్పారు, “మీరు ఈ చిన్నపిల్లలవలె మారితేనే కాని పరలోకరాజ్యంలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఈ చిన్నపిల్లల్లాగా తనను తాను తగ్గించుకొనేవాడు పరలోకరాజ్యంలో గొప్పవాడు అవుతాడు. మరియు ఇలాంటి ఒక చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. “ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లలలో ఒకరికి ఆటంకం కలిగిస్తే వారి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు. నా విషయంలో ప్రజలను ఆటంకపరిచే వాటిని బట్టి లోకానికి శ్రమ. అయితే అలాంటి శోధనలు తప్పవు కాని అవి ఎవరి వలన వస్తున్నాయో, వానికి శ్రమ. ఒకవేళ నీ చెయ్యి లేక నీ కాలు నీవు పొరపాట్లు చేయడానికి కారణమైతే వాటిని నరికి నీ దగ్గర నుండి పారవేయ్యి. రెండు చేతులు, రెండు కాళ్లు కలిగి నిత్యం మండుతున్న అగ్నిలో పడవేయబడే కంటే, కుంటివానిగా లేక అవయవాలు లేనివానిగా జీవంలో ప్రవేశించడం నీకు మేలు. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయ్యి. నీవు రెండు కళ్ళు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో జీవంలోనికి ప్రవేశించడం నీకు మేలు. “ఈ చిన్నపిల్లలలో ఒకరిని కూడా తక్కువవానిగా చూడకండి, ఎందుకంటే పరలోకంలో ఉన్న వీరి దూతలు ఎల్లప్పుడు పరలోకంలోని నా తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారని మీతో చెప్తున్నాను. [ఎట్లనగా, ‘తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికే మనుష్యకుమారుడు వచ్చాడు.’] “ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఏమి చేస్తాడని మీకు అనిపిస్తుంది? తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద వదిలిపెట్టి, తప్పిపోయిన ఆ ఒక గొర్రెను వెదకడానికి వెళ్లడా? ఒకవేళ అతనికి అది దొరికితే, తొంభై తొమ్మిది గొర్రెల కంటే తప్పిపోయి దొరికిన ఆ గొర్రె గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నశించడం పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు. “ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే నీవు వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వారిని గద్దించు. ఒకవేళ వారు నీ మాట వింటే నీవు వారిని సంపాదించుకున్నట్లే. వారు వినకపోతే, ‘ఇద్దరు ముగ్గురి సాక్ష్యంచే ప్రతి విషయం స్థిరపరచబడునట్లు’ నీతో పాటు ఒకరిని లేక ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్లు. వారు ఇంకా మాట వినకపోతే, ఆ సంగతిని సంఘానికి తెలియచేయండి. వారు సంఘం మాట కూడా వినకపోతే వారిని పక్కనపెట్టి ఒక యూదేతరులుగా లేక పన్ను వసూలుచేసేవారిగా పరిగణించండి. “మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “ఇంకొక విషయం, ఒకవేళ మీలో ఇద్దరు దేనిని గురించియైన భూమి మీద ఏకీభవించి అడిగితే అది పరలోకంలో నా తండ్రి వారి పట్ల దానిని జరిగిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకొని ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను” అని చెప్పారు.
మత్తయి 18:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?” అని యేసుని అడిగారు. అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, “మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను. కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే. కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు. “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు. “మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా? అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు. “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు. “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు. “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”
మత్తయి 18:1-20 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు. యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు. “అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను. “కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు. ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది. “మీ కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు. ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకిపారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు. “ఈ చిన్న పిల్లల్లో ఎవర్నీ చిన్న చూపు చూడకండి. నేను చెప్పేదేమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ళ దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. “ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు వున్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే, అతడు ఆ తొంబైతొమ్మిది గొఱ్ఱెల్ని కొండమీద వదిలి, ఆ తప్పిపోయిన గొఱ్ఱె కోసం వెతుక్కొంటూ వెళ్ళడా? మీరేమంటారు? ఇది సత్యం, ఒక వేళ ఆ గొఱ్ఱె దొరికితే ఆ తప్పిపోని తొంబైతొమ్మిది గొఱ్ఱెలు తన దగ్గరున్న దానికన్నా ఎక్కువ ఆనందిస్తాడు. అతనిలాగే పరలోకంలోవున్న నా తండ్రి ఈ చిన్న పిల్లల్లో ఎవ్వరూ తప్పిపోరాదని ఆశిస్తుంటాడు. “మీ సోదరుడు మీపట్ల అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి అతడు చేసిన అపరాధాల్ని అతనికి రహస్యంగా చూపండి. అతడు మీ మాట వింటే అతణ్ణి మీరు జయించినట్లే! ఒక వేళ అతడు మీ మాట వినకపోతే, ఒకరిద్దర్ని మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. వాళ్ళ మాట వినటానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వాళ్ళ సంఘానికి చెప్పండి. అతడు సంఘం చెప్పిన మాటకూడ వినకపోతే అతణ్ణి మీ వానిగా పరిగణించకండి. “ఇది సత్యం. ఈ ప్రపంచములో మీరు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను. అంతేకాక, నేను చెప్పేదేమిటంటే మీలో యిద్దరు కలసి దేవుణ్ణి ఏమి అడగాలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థించాలి. అప్పుడు పరలోకంలోవున్న నా తండ్రి మీ కోరిక తీరుస్తాడు. ఎందుకంటే, నా పేరిట యిద్దరు లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను అక్కడ వాళ్ళతో ఉంటాను.”
మత్తయి 18:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను –మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు. మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.