మత్తయి 15:22-28

మత్తయి 15:22-28 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అక్కడ నివసించే ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు! నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతోంది” అని కేకలు వేసింది. కాని యేసు ఆమె మాటలకు సమాధానం ఇవ్వలేదు. కనుక ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈమె కేకలువేస్తూ మన వెనుకే వస్తుంది గనుక ఈమెను పంపివేయమని” ఆయనను వేడుకొన్నారు. అందుకు యేసు, “నేను కేవలం ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను” అని చెప్పారు. ఆ స్త్రీ వచ్చి ఆయన ముందు మోకరించి, “ప్రభువా, నాకు సహాయం చేయమని” అడిగింది. అందుకు యేసు, “పిల్లల రొట్టెలను తీసికొని, కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు. అప్పుడు ఆమె, “నిజమే ప్రభువా, కానీ కుక్కలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలను తింటాయి కదా!” అని చెప్పింది. అందుకు యేసు, “అమ్మా, నీకు ఉన్న నమ్మకం చాలా గొప్పది! నీవు కోరినట్టే నీకు జరుగును గాక!” అని ఆమెతో చెప్పారు. ఆ క్షణంలోనే ఆమె కూతురు స్వస్థత పొందింది.

షేర్ చేయి
Read మత్తయి 15

మత్తయి 15:22-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది. కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు. అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది. ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు. ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది. అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.

షేర్ చేయి
Read మత్తయి 15

మత్తయి 15:22-28 పవిత్ర బైబిల్ (TERV)

కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది. యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు. యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు. ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది. యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు. “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది. అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.

షేర్ చేయి
Read మత్తయి 15

మత్తయి 15:21-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి–ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి– ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె–నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.

షేర్ చేయి
Read మత్తయి 15