మత్తయి 15:1-28

మత్తయి 15:1-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేము పట్టణం నుండి యేసు దగ్గరకు వచ్చి, “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వారు పెద్దల సాంప్రదాయాన్ని ఎందుకు పాటించరు?” అని అడిగారు. అప్పుడు యేసు వారితో ఈ విధంగా చెప్పారు, “మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు? ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి. ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే వారికి మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పారు. కానీ మీరు, ఎవరైనా తమ తండ్రితో గాని తల్లితో గాని సహాయపడడానికి ఉపయోగించినది ‘దేవునికి అంకితం’ అని ప్రకటిస్తే, వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కోసం దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి; వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ ” యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “మీరు విని తెలుసుకోండి. నోటిలోకి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు, కాని నోటి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రపరుస్తాయి” అని వారితో చెప్పారు. ఆ తర్వాత యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పరిసయ్యులు ఆ మాటలను విని అభ్యంతరపడ్డారు అని నీకు తెలుసా!” అని అడిగారు. అందుకు యేసు, “పరలోకపు నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో సహా పీకివేయబడుతుంది. వారిని వదిలిపెట్టండి; వారు గ్రుడ్డి మార్గదర్శకులు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే, వారిద్దరు గుంటలో పడతారు” అన్నారు. అందుకు పేతురు, “మాకు ఈ ఉపమానం అర్థమయ్యేలా చెప్పమని” అడిగాడు. యేసు, “మీరు ఇంకా అవివేకంగానే ఉన్నారా? నోటిలోకి పోయేవన్ని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడతాయని మీరు చూడలేదా? అని వారిని అడిగారు. కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలోనుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి. ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధసాక్ష్యం దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఇవే వ్యక్తిని అపవిత్రపరుస్తాయి; అంతేకాని చేతులు కడక్కుండా భోజనం చేస్తే అది వారిని అపవిత్రపరచదు” అని చెప్పారు. యేసు అక్కడినుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నివసించే ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు! నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతోంది” అని కేకలు వేసింది. కాని యేసు ఆమె మాటలకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈమె కేకలువేస్తూ మన వెనుకే వస్తుంది కాబట్టి ఈమెను పంపివేయమని” ఆయనను వేడుకొన్నారు. అందుకు యేసు, “నేను ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను” అని చెప్పారు. ఆ స్త్రీ వచ్చి ఆయన ముందు మోకరించి, “ప్రభువా, నాకు సహాయం చేయమని” అడిగింది. అందుకు యేసు, “పిల్లల రొట్టెలను తీసుకుని, కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు. అప్పుడు ఆమె, “నిజమే ప్రభువా, కానీ కుక్కలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలను తింటాయి కదా!” అని చెప్పింది. అందుకు యేసు, “అమ్మా, నీకు ఉన్న నమ్మకం చాలా గొప్పది! నీవు కోరినట్టే నీకు జరుగును గాక!” అని ఆమెతో చెప్పారు. ఆ క్షణంలోనే ఆమె కూతురు స్వస్థత పొందింది.

మత్తయి 15:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి, “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు. అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, “మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు. ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు. కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు. ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు. వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.” ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే, ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, “నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు” అని ఆయనతో అన్నారు. ఆయన, “పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది. వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు. అందుకు పేతురు, “ఈ ఉపమానభావం మాకు వివరించు” అని ఆయనను అడిగాడు. అప్పుడాయన, “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా? నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు. యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది. కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు. అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది. ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు. ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది. అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.

మత్తయి 15:1-28 పవిత్ర బైబిల్ (TERV)

కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి, “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు? దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు. కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు, ‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి. వాళ్ళ ఆరాధనలు వ్యర్థం! వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’” అని అన్నాడు. యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు. యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది. వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు. పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు. యేసు, “మీక్కూడా అర్థంకాలేదా? నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి. వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు. యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది. యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు. యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు. ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది. యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు. “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది. అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.

మత్తయి 15:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనముచేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? –తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. మీరైతే– ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి –నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా – ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి–ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి– ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె–నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.

మత్తయి 15:1-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)