మత్తయి 12:38-50
మత్తయి 12:38-50 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు, కొందరు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు. అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు. ఎలాగైతే యోనా మూడు రాత్రులు పగళ్ళు ఆ పెద్ద చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు కూడా మూడు రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాడు. నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.” దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచులనుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కనుక తీర్పు దినాన ఆమె ఈ తరంవారితోపాటు లేచి వారిని ఖండిస్తుంది. “అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కొరకు అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు. అప్పుడది, ‘నేను వదలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. అది తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరు లేకపోవడం, పైగా శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది. అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే చివరి స్ధితి దారుణంగా ఉంటుంది. ఈ దుష్టతరం కూడా అలాగే ఉంటుంది” అని చెప్పారు. యేసు ఆ జనసమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు. అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి మరియు సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచివున్నారు” అని చెప్పాడు. అందుకు యేసు అతనికి, “నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు?” అని చెప్పి తన శిష్యులను చూపిస్తూ, “వీరే నా తల్లి, నా సహోదరులు. ఎందుకంటే నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని చేసేవారే నా సహోదరుడు, సహోదరి మరియు తల్లి” అని జవాబిచ్చారు.
మత్తయి 12:38-50 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు, “వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు. యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది. అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.” ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు. అప్పుడొకడు, “నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు” అని ఆయనతో చెప్పాడు. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, “నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?” అని చెప్పి తన శిష్యులవైపు చెయ్యి చాపి, “నా తల్లి, నా సోదరులు వీరే! నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అన్నాడు.
మత్తయి 12:38-50 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా! మీరొక రుజువు చూపాలని మా కోరిక!” అని అన్నారు. కాని ఆయన చెప్పాడు: “దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరంవాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు. ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్ళు, మూడు రాత్రులు గడిపాడు. అదే విధంగా మనుష్యకుమారుడు మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు. నీనెవె ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈతరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తారు. కాని యిప్పుడు యోనా కంటె గొప్పవాడు యిక్కడున్నాడు. “దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్ళతో కలసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తుంది. కాని యిప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. “దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన నాయింటికి మళ్ళీ వెళ్తాను’ అని అనుకొంటుంది. అది తిరిగి వచ్చి, ఆయింటిని ఎవ్వరూ ఆక్రమించనట్లు, పైగా శుభ్రంగా వూడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది. అప్పుడది వెళ్ళి తనతో సహా, తనకన్నా దుష్టమైన ఏడు దయ్యాల్ని పిలుచుకు వస్తుంది. అన్నీ కలసి ఆ యింటిలోకి వెళ్ళి నివశిస్తాయి. అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం ఔతుంది. దుర్బుద్ధిగల ఈ తరం వాళ్ళకు ఇలాంటి గతి పడ్తుంది” అని చెప్పాడు. యేసు ప్రజలతో యింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు. ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అన్నాడు. తన శిష్యుల వైపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. ఎవరైతే పరలోకంలోని నా తండ్రి యిచ్చానుసారం నడుచుకొంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లెండ్రు, నా తల్లి” అని అన్నాడు.
మత్తయి 12:38-50 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు–బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. –వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుటచూచి, వెళ్లి తనకంటె చెడ్డైవెన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను. ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు –ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి– నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియుననెను.