మత్తయి 12:29-32
మత్తయి 12:29-32 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు. “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను. మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు.
మత్తయి 12:29-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు. నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే. “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.
మత్తయి 12:29-32 పవిత్ర బైబిల్ (TERV)
అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు. నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు. “అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు. మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు.
మత్తయి 12:29-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.