మలాకీ 4:1-6

మలాకీ 4:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నియమిత దినం రాబోతుంది. అది కాలుతూ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులంతా, దుర్మార్గులంతా ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిలో ఒక్కరికి కూడా వేరు గానీ, చిగురు గానీ ఉండదు. రాబోయే ఆ దినాన అందరూ తగలబడి పోతారు. అయితే నా పట్ల భయభక్తులు ఉన్న మీ కోసం నీతిసూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల చాటున మీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మీరు బయటికి వెళ్లి కొవ్విన దూడల్లాగా గంతులు వేస్తారు. నేను నియమించే ఆ రోజు దుర్మార్గులు మీ కాళ్ళ కింద బూడిదలాగా ఉంటారు. మీరు వాళ్ళను అణగదొక్కుతారు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు ప్రజల కోసం నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ దగ్గరికి పంపుతాను. నేను వచ్చి దేశాన్ని శపించకుండా ఉండేలా అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు, పిల్లల హృదయాలను తండ్రుల వైపుకు తిప్పుతాడు.”

షేర్ చేయి
Read మలాకీ 4

మలాకీ 4:1-6 పవిత్ర బైబిల్ (TERV)

“తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. ఆ గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. ఆ దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. ఆ సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు-దాని కొమ్మగాని, వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెడ్తుంది. పాకనుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు. అప్పుడు మీరు ఆ దుర్మార్గుల మీద నడుస్తారు-వారు మీ పాదాలక్రింద బూడిదలా ఉంటారు. తీర్పు సమయంలో ఆ సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! “మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకొని, విధేయత చూపండి. మోషే నా సేవకుడు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలీయులందరికోసం ఆ చట్టాలు, నియమాలు నేను అతనికి ఇచ్చాను.” “చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు పంపిస్తాను. యెహోవానుంచి వచ్చే ఆ మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు. తల్లిదండ్రులు వారి పిల్లలకు సన్నిహితులగుటకు ఏలీయా సహాయం చేస్తాడు. మరియు అతడు (ఏలీయా) పిల్లలు వారి తల్లిదండ్రులకు సన్నిహితులగుటకు సహాయం చేస్తాడు. ఇది జరిగి తీరాలి. లేదా నేను వచ్చి, మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాను,” అని యెహోవా చెప్పాడు!

షేర్ చేయి
Read మలాకీ 4

మలాకీ 4:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైననులేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్వినదూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లలతట్టును పిల్లల హృదయములను తండ్రులతట్టును త్రిప్పును.

షేర్ చేయి
Read మలాకీ 4

మలాకీ 4:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“తీర్పు దినం ఖచ్చితంగా వస్తుంది; అది మండుతున్న కొలిమిలా ఉంటుంది. గర్విష్ఠులందరూ, కీడుచేసే ప్రతివాడు ఎండుగడ్డిలా ఉంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. “రాబోయే ఆ రోజున వారు కాలిపోతారు, వారికి వేరు గాని, కొమ్మ గాని మిగలదు. అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు. నేను నియమించే ఆ రోజున దుర్మార్గులు మీ కాళ్లక్రింద ధూళిలా ఉంటారు, మీరు వారిని త్రొక్కివేస్తారు” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. “నా సేవకుడైన మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ఉద్దేశించింది, హోరేబు పర్వతం మీద నేను అతనికి ఇచ్చిన ఆజ్ఞలు, చట్టాలు జ్ఞాపకముంచుకోండి. “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకముందు నేను ఏలీయా ప్రవక్తను మీ దగ్గరికి పంపిస్తాను. నేను వచ్చి దేశాన్ని శపించకుండ ఉండేలా అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు త్రిప్పుతాడు.”

షేర్ చేయి
Read మలాకీ 4