మలాకీ 3:2-4
మలాకీ 3:2-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడుమునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులునుచేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును.
మలాకీ 3:2-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలడు? ఆయన కనబడినప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి కొలిమిలో ఉండే నిప్పులాంటివాడు, చాకలి చేతిలోని సబ్బు వంటివాడు. ఆయన వెండిని పరీక్షించి పుటం పెట్టి శుద్ధి చేసేవాడిలాగా కూర్చుంటాడు. వెండి బంగారాలను శుద్ధి చేసి పుటంపెట్టే విధంగా ఆయన లేవీ గోత్రం వారిని శుద్ధి చేస్తాడు. అప్పుడు వాళ్ళు నీతి నియమాలను అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు. గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్టుగా, యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు అర్పించే నైవేద్యాలు యెహోవాకు ప్రీతికరంగా ఉంటాయి.
మలాకీ 3:2-4 పవిత్ర బైబిల్ (TERV)
“ఆ సమయాన్ని ఏ వ్యక్తి ఆపలేడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిల బడలేరు. ఆయన మండుతున్న అగ్నిలా ఉంటాడు. ప్రజలు వస్తువులను శుభ్రం చేయుటకు ఉపయోగించే శక్తివంతమైన సబ్బులా ఆయన ఉంటాడు. ఆయన లేవీ ప్రజలను శుభ్ర పరుస్తాడు. అగ్నిచేత వెండి శుద్ధి చేయబడినట్టు ఆయన వారిని శుద్ధి చేస్తాడు. స్వచ్ఛమైన బంగారంలా, వెండిలా ఆయన వారిని చేస్తాడు. అప్పుడు వారు యెహోవాకు కానుకలు తీసికొని వస్తారు-వాటిని సరైన పద్ధతిలో వారు చేస్తారు. అప్పడు యూదా నుండి, యెరూషలేము నుండి కానుకలను యెహోవా స్వీకరిస్తాడు. అది గతంలో ఉన్నట్టుగా ఉంటుంది. అది చాలకాలం క్రిందట ఉన్నట్టుగా ఉంటుంది.
మలాకీ 3:2-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలరు? ఆయన కనబడేటప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి నిప్పులాంటి వాడు, బట్టలను శుద్ధి చేసే చాకలివాని సబ్బు లాంటివాడు. ఆయన వెండిని పరీక్షించి, పుటం పెట్టి శుద్ధి చేసే కంసాలిలా కూర్చుంటారు, వెండి బంగారాలను పుటం పెట్టే విధంగా ఆయన లేవీ వారిని శుద్ధి చేస్తారు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు. గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్లు యూదా వారు యెరూషలేము నివాసులు చేసే అర్పణలు యెహోవాకు అంగీకారమవుతాయి.