మలాకీ 2:10-16

మలాకీ 2:10-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనకందరికి తండ్రి ఒక్కడే కదా. ఒక్క దేవుడే మనలను సృష్టించాడు కదా. అలాంటప్పుడు మనం ఒకరి పట్ల ఒకరం ద్రోహం చేసుకుంటూ, మన పూర్వీకులతో చేసిన కట్టడను ఎందుకు తిరస్కరిస్తున్నాం? యూదా ప్రజలు ద్రోహులుగా మారారు. ఇశ్రాయేలు ప్రజల మధ్య యెరూషలేములోనే నీచ కార్యాలు జరుగుతున్నాయి. యూదా ప్రజలు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసి అన్యదేవత ఆరాధకుల పిల్లలను వివాహం చేసుకున్నారు. ఈ విధంగా చేసిన వాళ్ళను యాకోబు సంతానానికి చెందిన గుడారాల్లో లేకుండా, సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించే వారి సహవాసంలో లేకుండా యెహోవా నాశనం చేస్తాడు. మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అని మీరు అడుగుతారు. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షిగా నిలబడతాడు. నీ భార్య నీ సహకారి కాదా, నీవు చేసిన నిబంధన ప్రకారం భార్య కాదా. ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి. ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.

షేర్ చేయి
Read మలాకీ 2

మలాకీ 2:10-16 పవిత్ర బైబిల్ (TERV)

మన అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు (దేవుడు). ఆ దేవుడే మనలో ప్రతి ఒక్కరినీ చేశాడు! కాని, ప్రజలు ఎందుకు వారి సోదరులను మోసం చేస్తున్నారు? ఆ ప్రజలు ఒడంబడికను సన్మానించటం లేదని వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు దేవునితో చేసుకున్న ఒడంబడికను వారు గౌరవించరు. యూదా మనుష్యులు ఇతరులను మోసం చేశారు. యెరూషలేములో, ఇశ్రాయేలులో ప్రజలు భయంకర విషయాలు జరిపించారు. యూదాలో ప్రజలు యెహోవా పవిత్ర ఆలయాన్ని గౌరవించలేదు. ఆ స్థలం దేవునికి ఇష్టమైనది! యూదా ప్రజలు ఆ విదేశీ దేవతను పూజించటం మొదలు పెట్టారు. యెహోవా ఆ మనుష్యులను యూదా వంశంలోనుండి తొలగించివేస్తాడు. ఆ ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని రావచ్చుగాక, కానీ అది సహాయ పడదు. నీవు ఏడ్చి, యెహోవా బలిపీఠాన్ని కన్నీళ్ళతో నింపవచ్చు, కానీ యెహోవా నీ కానుకలు అంగీకరించడు. నీవు ఆయనకోసం తెచ్చే వస్తువులతో యెహోవా సంతోషించడు. “మా కానుకలను యెహోవా ఎందుచేత అంగీకరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి. నీవు నీ భార్యను మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువకునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు. ఆమె నీకు భార్య అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు. భర్తలు, భార్యలు ఒకే శరీరం, ఒకే ఆత్మ కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే, వారికి పవిత్రమైన పిల్లలు ఉండాలని. అందుచేత ఆత్మపరమైన ఆ ఐక్యతను కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు. నీవు యువకునిగా ఉన్నప్పటినుండి ఆమె నీకు భార్యగా ఉంది. “విడాకులు అంటే నాకు అసహ్యం. మరియు పురుషులు తమ భార్యలయెడల చేసే క్రూరమైన పనులు నాకు అసహ్యం. అందుచేత మీ ఆత్మపరమైన ఐక్యాన్ని కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు” అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెపుతున్నాడు.

షేర్ చేయి
Read మలాకీ 2

మలాకీ 2:10-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహముచేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయులమధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి. యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయు నున్నాడు. అది ఎందుకని మీ రడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి.

షేర్ చేయి
Read మలాకీ 2

మలాకీ 2:10-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మనకందరికి తండ్రి ఒక్కడు కాదా? ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా? అలాంటప్పుడు ఒకరిపట్ల ఒకరం నమ్మకద్రోహం చేస్తూ దేవుడు మన పూర్వికులతో చేసిన నిబంధనను ఎందుకు అపవిత్రం చేస్తున్నాము? యూదా వారు నమ్మకద్రోహులయ్యారు, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములో అసహ్యమైన పనులు జరుగుతున్నాయి. యూదా వారు యెహోవా ప్రేమించే పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరచి ఇతర దేవతలను పూజించేవారి స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఇలా చేసినవారు ఎవరైనా సరే యాకోబు వంశీయుల డేరాలలో లేకుండా సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించేవారి సహవాసంలో లేకుండా యెహోవా నిర్మూలించు గాక! మీరు మరొకసారి అలాగే చేస్తున్నారు: మీ కన్నీళ్లతో యెహోవా బలిపీఠాన్ని తడుపుతున్నారు. ఆయన మీ నైవేద్యాలను ఇష్టపడరు వాటిని మీ నుండి సంతోషంతో స్వీకరించరు కాబట్టి మీరు ఏడుస్తూ రోదిస్తారు. “ఎందుకు?” అని మీరడుగుతారు. ఎందుకంటే నీకు నీ యవ్వనకాలంలో నీవు పెండ్లాడిన భార్యకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నారు. ఆమె నీ భాగస్వామి, నీ చేసిన వివాహ నిబంధన వలన నీ భార్య అయినప్పటికీ నీవు ఆమెకు ద్రోహం చేశావు. ఆయన మీ ఇద్దరిని ఒకటి చేయలేదా? శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా! అలా ఒకటిగా చేయడం ఎందుకు? దేవుని మూలంగా వారికి సంతానం కలగాలని కదా! అందుచేత మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి, యవ్వనంలో పెండ్లాడిన మీ భార్యకు ద్రోహం చేయకండి. “పెళ్ళి బంధాన్ని తెంచడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నారు. మనిషి వస్త్రంలా దౌర్జన్యాన్ని కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నారు. కాబట్టి మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం తలపెట్టకండి.

షేర్ చేయి
Read మలాకీ 2