మలాకీ 2:1-9

మలాకీ 2:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“యాజకులారా, ఈ ఆజ్ఞ మీ కోసమే! మీరు నా మాట వినకుండా నా పేరును మనసారా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే, నేను మీ మీదికి శాపం రప్పిస్తాను. మీరు పొందుకున్న దీవెనలను కూడా నేను శాపాలుగా మారుస్తాను. నిజానికి, మీరు నా హెచ్చరికను గుర్తు ఉంచుకోలేదు కాబట్టి నేను ఇప్పటికే వాటిని శాపాలుగా మార్చాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను మీ కారణంగా మీ సంతానాన్ని గద్దిస్తాను; మీ పండుగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాల మీద వేస్తాను. దానితో పాటు మీరు కూడా ఊడ్చివేయబడతారు. నేను లేవీయులకు చేసిన ఒడంబడిక ఉండిపోయేలా నేనే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని మీరు తెలుసుకుంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు. సత్యమైన ఉపదేశం వారి నోటి నుండి వెలువడిందే తప్ప దుర్బోధ ఏమాత్రం కాదు. వారు సమాధానంతో నిజాయితీ కలిగి నా సహవాసంలో నడిచారు. వారు అనేకులను పాపం విడిచిపెట్టేలా చేశారు. “యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి. మీరైతే దారి తప్పారు, మీ ఉపదేశం వల్ల అనేకులు తడబడ్డారు, నేను లేవీయులతో చేసిన ఒడంబడికను వమ్ము చేశారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. “నా మార్గాలను అనుసరించక, ధర్మశాస్త్ర విషయాల్లో పక్షపాతం చూపుతూ వచ్చారు, కాబట్టి ప్రజలందరి కళ్లెదుటే మిమ్మల్ని అణచివేసి తృణీకారానికి గురిచేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

షేర్ చేయి
చదువండి మలాకీ 2

మలాకీ 2:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి యాజకులారా, నేనిచ్చే ఈ ఆజ్ఞ మీ కోసమే. సైన్యాలకు అధిపతియైన యెహోవా చెప్పేది ఏమిటంటే, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటించకుండా, నా నామాన్ని మనస్ఫూర్తిగా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే నేను మీ మీదికి శాపం వచ్చేలా చేస్తాను. మీకు కలిగిన ఆశీర్వాద ఫలాలను శపిస్తాను. మీరు ఇంకా దాన్ని గుర్తుకు తెచ్చుకోలేదు గనుక ఇంతకుముందే నేను వాటిని శపించాను. మిమ్మల్ని బట్టి మీ సంతానాన్ని పెకలించి వేస్తాను. మీ పండగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాలపై వేయిస్తాను. పేడ ఊడ్చి వేసే స్థలానికి మీరు ఊడ్చి వేయబడేలా చేస్తాను. దీన్ని బట్టి నేను లేవీయులకు నిబంధనగా ఉండేలా ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాణ్ణి నేనే అని మీరు తెలుసు కుంటారు అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు. నేను చేసిన నిబంధన వారి ప్రాణానికి, శాంతికి మూల కారణం. నా పట్ల వారికి భయభక్తులు కలిగించడానికి నేను వాటిని ఇచ్చాను. కాబట్టి వారు నా పట్ల భయభక్తులు కలిగి, నా నామం విషయంలో భయం కలిగి నడుచుకున్నారు. వారు దుర్బోధ ఎంతమాత్రమూ చేయకుండా సత్యమైన ధర్మశాస్త్రం బోధిస్తూ వచ్చారు. సమాధానంతో, యథార్థతతో నన్ను అనుసరించి అనేకులను అన్యాయం నుండి మళ్ళుకునేలా చేశారు. యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా వార్తాహరులు గనుక ప్రజలు వారి నోటనుండి వచ్చే ధర్మశాస్త్ర విధులు నేర్చుకొంటారు గనుక వారు జ్ఞానం కలిగి వాటిని బోధించాలి. అయితే మీరు దారి తప్పారు. మీరు చేసిన ఉపదేశం వల్ల చాలా మంది దారి తప్పారు. నేను లేవీయులతో చేసిన నిబంధనను వమ్ము చేశారు. ధర్మశాస్త్ర ఉపదేశంలో మీరు జరిగించిన పక్షపాతం వల్ల ప్రజలందరి ఎదుట మిమ్మల్ని తిరస్కారానికి గురైన వారుగా, అణగారి పోయిన వారుగా చేశాను అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు.

షేర్ చేయి
చదువండి మలాకీ 2

మలాకీ 2:1-9 పవిత్ర బైబిల్ (TERV)

“యాజకులారా, ఈ నియమం మీ కోసమే! నా మాట వినండి! నేను చెప్పే మాటలు గమనించండి! నా పేరును మీరు గౌరవించాలి. మీరు నా పేరును గౌరవించకపోతే, అప్పుడు మీకు చెడు విషయాలు సంభవిస్తాయి. మీరు ఆశీర్వాదాలు చెప్పగా అవి శాపనార్థాలు అవుతాయి. మీరు నా పేరు అంటే గౌరవం చూపడం లేదు గనుక కీడులు సంభవించేటట్టు నేను చేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “చూడండి, మీ సంతతివారిని నేను శిక్షిస్తాను. పవిత్ర దినాల్లో, యాజకులారా, మీరు నాకు బలులు అర్పిస్తారు. చచ్చిన జంతువుల్లోనుండి పేడ, పేగులు మీరు తీసి, వాటిని పారవేస్తారు. కానీ నేను ఆ పేడను మీ ముఖాలకు పులిమివేస్తాను, మరియు దానితోపాటు మీరు విసరివేయబడతారు! అప్పుడు ఈ ఆజ్ఞను నేను ఎందుకోసం మీకు ఇచ్చానో అది మీరు నేర్చుకొంటారు. లేవీతో నా ఒడంబడిక కొనసాగాలని నేను ఈ విషయాలు మీతో చెపుతున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. (యెహోవా చెప్పాడు,) “లేవీతో ఆ ఒడంబడిక నేను చేశాను. అతనికి జీవం, శాంతి ఇస్తానని నేను వాగ్దానం చేశాను. మరియు నేను వాటిని అతనికి ఇచ్చాను! లేవీ నేనంటే భయభక్తులు చూపాడు! అతడు నా పేరుకు గౌరవం చూపించాడు! లేవీ సత్య ప్రబోధాలు నేర్పించాడు. లేవీ అబద్ధాలు నేర్పించలేదు. లేవీ నిజాయితీపరుడు, అతడు శాంతిని ప్రేమించాడు. లేవీ నన్ను అనుసరించి, అనేకమంది తాము చేసిన చెడ్డ పనులనుబట్టి శిక్షింపబడకుండా వారిని అతడు రక్షించాడు. ప్రతి యాజకుడూ దేవుని ప్రబోధాలు ఎరిగి ఉండాలి. ప్రజలు ఒక యాజకుని దగ్గరకు వెళ్లి, దేవుని ప్రబోధాలను అతని వద్ద నేర్చుకోగలిగి ఉండాలి. యాజకుడు ప్రజలకు దేవుని సందేశకునిగా ఉండాలి.” (యెహోవా చెప్పాడు,) “యాజకులారా, మీరు నన్ను అనుసరించటం మానివేశారు! మనుష్యులచేత చెడు చేయించటానికి ఆ ప్రబోధాలు మీరు వినియోగించుకొన్నారు. లేవీతోటి ఒడంబడికను మీరు భగ్నం చేశారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “నేను మీతో చెప్పిన విధంగా మీరు జీవించరు! మీరు నా ప్రబోధాలు అంగీకరించలేదు! కనుక నేను మిమ్మల్ని ప్రాముఖ్యం లేనివారినిగా చేస్తాను. ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు!”

షేర్ చేయి
చదువండి మలాకీ 2

మలాకీ 2:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడి యున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరు ఆయాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకుమునుపే నేను వాటిని శపించి యుంటిని. మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీ కిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందు రని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాదూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు. నా మార్గములను అనుస రింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్ష పాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

షేర్ చేయి
చదువండి మలాకీ 2