లూకా 9:37-45

లూకా 9:37-45 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మరుసటిరోజు, వారు కొండ దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. ఆ జనసమూహంలోని ఒకడు బిగ్గరగా పిలిచి, “బోధకుడా, దయచేసి నా కుమారుని వైపు చూడు, నాకు వీడు ఒక్కడే కుమారుడు. అపవిత్రాత్మ వీనిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడు; అది వాన్ని మూర్ఛపోయేలా చేస్తుంది అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు. వానిని విలవిలలాడించి వేధించి వదలుతుంది. దానిని వెళ్లగొట్టమని నేను నీ శిష్యులను బతిమాలుకొన్నాను, కానీ వారి వల్ల కాలేదు” అని చెప్పాడు. యేసు “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహిస్తాను? నీ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకొనిరా” అన్నారు. వాడు వస్తుండగానే, ఆ దయ్యం వానిని క్రింద పడద్రోసి మూర్ఛపోయేలా చేసింది. కాని యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి, ఆ బాలుని స్వస్థపరచి అతని తండ్రికి అప్పగించారు. దేవుని గొప్పతనాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపడ్డారు. యేసు చేసినవాటన్నిటిని చూసి ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉంటే, ఆయన తన శిష్యులతో, “నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా వినండి: మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు” అని చెప్పారు. అయితే వారు ఆ మాటల అర్థాన్ని గ్రహించలేదు. అది వారికి మరుగు చేయబడింది కనుక వారు దానిని తెలుసుకో లేకపోయారు. అంతేకాదు వారు దాని గురించి అడగడానికి కూడా భయపడ్డారు.

షేర్ చేయి
Read లూకా 9

లూకా 9:37-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు. చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు. యేసు, “విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?” అని, “నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా” అని ఆ తండ్రితో చెప్పాడు. వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు. అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనుష్య కుమారుణ్ణి మనుషుల స్వాధీనం చేయబోతూ ఉన్నారు” అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేక పోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు.

షేర్ చేయి
Read లూకా 9

లూకా 9:37-45 పవిత్ర బైబిల్ (TERV)

మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది. ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు. ఒక దయ్యం అతణ్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది ఆతణ్ణి క్రింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కుతాడు. అది అతణ్ణి వదలటం లేదు. అతణ్ణి పూర్తిగా నాశనం చేస్తొంది. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు. యేసు, “మూర్ఖతరం వారలారా! విశ్వాస హీనులారా! మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు. ఆ దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు. దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు: “నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనుష్యకుమారుణ్ణి ఒక ద్రోహి యితర్లకు అప్పగిస్తాడు.” వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు అర్థం కాకుండునట్లు రహస్యంగా ఉంచబడింది. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు.

షేర్ చేయి
Read లూకా 9

లూకా 9:37-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పెట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను. అందుకు యేసు –విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, నేనెంతకాలము మీతోకూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను. గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన–ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.

షేర్ చేయి
Read లూకా 9