లూకా 8:49-51
లూకా 8:49-51 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చాడు, యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకునికి శ్రమ కలిగించవద్దు” అని చెప్పాడు. వారి మాటలను విని, యేసు యాయీరుతో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపడుతుంది” అని చెప్పారు. ఆయన యాయీరు ఇల్లు చేరిన తర్వాత, పేతురు, యోహాను, యాకోబు మరియు ఆ బాలిక తల్లిదండ్రులును తప్ప మరి ఎవరిని లోనికి రానివ్వలేదు.
లూకా 8:49-51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయీరుతో, “మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు” అని చెప్పాడు. యేసు ఆ మాట విని, “భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది” అని చెప్పాడు. అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు.
లూకా 8:49-51 పవిత్ర బైబిల్ (TERV)
యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటినుండి ఒకడు వచ్చి అతనితో, “మీ కూతురు చనిపోయింది. ప్రభువును కష్టపెట్టనవసరం లేదు” అని అన్నాడు. ఇది విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని అన్నాడు. యేసు యాయీరు యింటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి తండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు.
లూకా 8:49-51 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాటవిని–భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.