లూకా 8:43-48

లూకా 8:43-48 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మరియు పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసినా గానీ, ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు. ఆమె ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టింది, వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. “నన్ను ముట్టింది ఎవరు?” అని యేసు అడిగారు. మేము కాదని అందరు అంటూ ఉంటే, పేతురు, “బోధకుడా, ప్రజలు గుంపుగా నీపై పడుతున్నారు కదా” అన్నాడు. అయినా యేసు, “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్లినట్లు నాకు తెలిసింది” అని అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, ఇక దాగి ఉండలేనని తెలిసి, వణుకుతు వచ్చి ఆయన పాదాల యెదుట సాగిలపడింది. ఆమె ఎందుకు ఆయనను ముట్టుకుందో మరియు వెంటనే ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ముందు చెప్పింది. అప్పుడు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.

షేర్ చేయి
Read లూకా 8

లూకా 8:43-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. యేసు, “నన్ను తాకిందెవరు?” అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు, “మాకు తెలియదే” అన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ క్రిక్కిరిసి నీమీద పడుతున్నారు” అన్నాడు. అయితే యేసు, “ఎవరో నన్ను తాకారు. నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది” అన్నాడు. ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుటా వివరించి చెప్పింది. అందుకు ఆయన, “అమ్మాయీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు” అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 8

లూకా 8:43-48 పవిత్ర బైబిల్ (TERV)

ఆ గుంపులో పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్తున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడూ ఆమె రోగాన్ని నయం చేయలేక పోయాడు ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆయన, “నన్నెవరు తాకారు?” అని అడిగాడు. అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ! ప్రజలు త్రోసుకొంటూ మీ మీద పడ్తున్నారు కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు. యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు. అప్పుడా స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి, వణకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా! నీ విశ్వాసం నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు” అని అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 8

లూకా 8:43-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్ర్తీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. –నన్నుముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును–మేమెరుగమన్నప్పుడు, పేతురు–ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా యేసు–ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను. తాను మరుగై యుండలేదని, ఆ స్ర్తీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను. అందుకాయన–కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 8