లూకా 8:26-38
లూకా 8:26-38 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు గలిలయ సరస్సును దాటి, గెరాసేనీయులు నివసించు ప్రాంతాన్ని చేరుకొన్నారు. యేసు ఒడ్డున అడుగు పెట్టగానే, దయ్యాలు పట్టిన గ్రామస్తుడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు చాలా కాలం నుండి బట్టలు వేసుకోలేదు ఇంట్లో నివసించలేదు, సమాధుల్లో ఉండేవాడు. వాడు యేసును చూడగానే, వాడు కేక వేస్తూ ఆయన పాదాల దగ్గర పడి, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? నన్ను వేధించవద్దని నిన్ను వేడుకొంటున్నాను!” అని బిగ్గరగా అరిచాడు. ఎందుకంటే యేసు ఆ అపవిత్రాత్మను వాని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించారు. అది చాలాసార్లు వానిని పట్టి పీడిస్తూ ఉంది, వాని కాళ్ళకు చేతులకు గొలుసులను వేసి బంధించి కాపలా ఉన్నా, కాని వాడు ఆ గొలుసులను తెంపివేసేవాడు, అరిచేవాడు అరణ్యంలోనికి తరమబడేవాడు. “నీ పేరేమి?” అని యేసు వానిని అడిగారు. “సేన” అని వాడు జవాబిచ్చాడు, ఎందుకంటే అనేక దయ్యాలు వానిలో చొరబడి ఉన్నాయి. పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించొద్దని అవి యేసును పదే పదే బ్రతిమలాడాయి. అక్కడ ఒక పెద్ద పందుల మంద కొండ మీద మేస్తూ ఉంది. ఆ దయ్యాలు ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వుమని యేసును బ్రతిమలాడాయి, ఆయన వాటికి అనుమతి ఇచ్చారు. ఆ దయ్యాలు వానిలో నుండి బయటకు వచ్చి, ఆ పందులలోనికి చొరబడ్డాయి, వెంటనే ఆ మంద కొండ మీది నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది. ఎప్పుడైతే పందులను కాస్తున్నవారు జరిగిన దానిని చూసారో, వారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను గ్రామీణ ప్రాంతంలోను తెలియజేసారు. ప్రజలు ఏమి జరిగిందో చూడడానికి వెళ్లారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు, దయ్యాలు వదలిన మనుష్యుడు, బట్టలు వేసుకొని సరియైన మానసిక స్థితిలో, యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు. ఆ దయ్యాలు పట్టినవాడు ఎలా బాగయ్యాడో చూసినవారు ఆ గ్రామ ప్రజలకు తెలియజేసారు. అప్పుడు గెరాసేన ప్రాంతపు ప్రజలందరు ఎంతో భయపడి, తమను విడిచిపొమ్మని యేసును బ్రతిమలాడారు. కనుక ఆయన పడవ ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయారు. అప్పుడు ఆ దయ్యాల నుండి విడుదల పొందినవాడు, తాను ఆయనతో పాటు వస్తానని బ్రతిమలాడాడు.
లూకా 8:26-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు. ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు. వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు. ఎందుకంటే ఆయన, “ఈ వ్యక్తిని వదిలి బయటకు రా” అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి. యేసు, “నీ పేరు ఏమిటి?” అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి. కాబట్టి వాడు, “నా పేరు సైన్యం” అన్నాడు. పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి. అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తయిన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి. ఆ పందులను మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు. ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్ళారు. వారంతా యేసు దగ్గరికి వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు. జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు. గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు. తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు. ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్ళబోతుంటే దయ్యాలు వదిలిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు.
లూకా 8:26-38 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మరియు ఆయన శిష్యులు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది. యేసు ఒడ్డు చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. స్మశానాల్లో నివసించేవాడు. ఆ దయ్యం పట్టినవాడు యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. యేసు ఆ దయ్యాన్ని అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ దయ్యం అతణ్ణి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. అయినా అతడు ఆ గొలసులను తెంపుకొనేవాడు. ఆ దయ్యం అతణ్ణి నిర్మానుష్య స్థలాలకు లాక్కొని వెళ్ళేది. యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు. అతడు, “సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి. అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకున్నాయి. ఆయన అనుమతినిచ్చాడు. ఆ దయ్యాలు ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి. పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు. ప్రజలు ఏమి జరిగిందో చూడాలని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది. జరిగింది చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు. గెరాసేను ప్రజలందరికి చాలా భయం వేయటంవల్ల తమ ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు. అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు. దయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని యేసును బ్రతిమిలాడాడు.
లూకా 8:26-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు గలిలయకు ఎదురుగాఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపెట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడి–యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను. ఏలయనగా ఆయన–ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు–నీ పేరేమని వానినడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచినవారు దయ్యములు పెట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతోకూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.