లూకా 8:1-3
లూకా 8:1-3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ తర్వాత, యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం చేశారు. ఆయనతోపాటు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు, మరియు అపవిత్రాత్మల నుండి వ్యాధుల నుండి బాగుపడిన కొందరు స్త్రీలు, అనగా, ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ; హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య యోహన్న; సూసన్న మరియు ఇంకా అనేకమంది ఉన్నారు. ఈ స్త్రీలు తమకు కలిగిన వాటితో వారికి సహాయం చేసేవారు.
లూకా 8:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్త బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు. పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు. వారంతా తమ స్వంత ధనం, సామగ్రిని వెచ్చించి ఆయనకు, ఆయన శిష్యులకు సహాయం చేసేవారు.
లూకా 8:1-3 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లెలు పర్యటించి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రకటించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే ఉన్నారు. దయ్యాలు విడిపించబడిన కొందరు స్త్రీలు, రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్దలేనే అని పిలవబడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు విడిపించబడ్డాయి. హేరోదు రాజుకు కుడిభుజంగా ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు చాలా మంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపొస్తలులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు.
లూకా 8:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్ర్తీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి. వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.