లూకా 6:37-49
లూకా 6:37-49 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.” యేసు వారికి ఈ ఉపమానాన్ని కూడా చెప్పారు, “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపించగలడా? వారిద్దరు గుంటలో పడరా? ఒక శిష్యుడు బోధకుని కంటే ఉన్నతుడు కాడు, అయితే పూర్తిగా శిక్షణ పొందుకొన్నవాడు తన బోధకునిలా అవుతాడు. “నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవడం విఫలమైన నీవు నీ సహోదరునితో, ‘సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు’ అని నీవెలా అనగలవు? ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. “ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. ప్రతి చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. ప్రజలు ముళ్ళపొదల్లో అంజూర పండ్లను, లేదా గచ్చ పొదల్లో ద్రాక్షపండ్లను కోయరు. మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది. “నేను చెప్పే మాట ప్రకారం చేయకుండా ఎందుకు నన్ను ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుస్తున్నారు? నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు ఎలాంటివారో నేను మీకు చెప్తాను. లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, ఇల్లు కట్టిన వ్యక్తిలా ఉంటారు. వరదలు వచ్చి ప్రవాహాలు వేగంగా ఆ ఇంటిని తాకాయి కాని ఆ ఇంటిని ఏమి చేయలేకపోయాయి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఇంటిని బలమైన పునాది మీద కట్టుకున్నాడు. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాని లాంటివారు. వరద ప్రవాహం వేగంగా ఆ ఇంటిని తాకగానే, అది కూలి పూర్తిగా ధ్వంసం అయ్యింది.”
లూకా 6:37-49 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది. ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.” తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా? శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు. నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు? నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో, ‘సోదరా, నీ కంట్లో నలుసు తీసివేయనియ్యి’ అని నువ్వెలా చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివెయ్యి. అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు. ఏ చెట్టయినా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకోరు. రక్కెస పొదలో ద్రాక్షపళ్ళు కోయరు. మంచి మనిషి తన హృదయమనే ధననిధిలో నుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో నిండి ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది. నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే, ‘ప్రభూ, ప్రభూ’ అని నన్ను పిలవడం ఎందుకు? “నా దగ్గరికి వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవరిని పోలి ఉంటాడో వినండి. వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు కనుక దాన్ని కదిలించలేక పోయింది. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది. ఆ ఇంటి నాశనం ఎంతో దయనీయం.”
లూకా 6:37-49 పవిత్ర బైబిల్ (TERV)
“ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.” ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్తారు కదా! శిష్యుడు తన గురువుకన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు. “నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు? నీ కంట్లో దూలం పెట్టుకొని, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు’ అని అతనితో ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా చూడ కలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తియ్యాలో తెలుసుకుంటావు. “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు. మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు. “నేను చెప్పింది చెయ్యకుండా నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలవటం ఎందుకు? నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి. అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు కూలి పోలేదు. “నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”
లూకా 6:37-49 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను–గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో–సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక– ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను.