లూకా 6:12-49
లూకా 6:12-49 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ రోజుల్లో ఒక రోజు ప్రార్థించడానికి యేసు కొండెక్కి రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు. ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఎన్నుకుని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా “పిలువబడిన వారు” అని అర్థము: వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయన కొండ దిగి వారితో పాటు మైదానంలో నిలబడ్డారు. అక్కడ ఆయన శిష్యుల యొక్క గొప్ప జనసమూహం ఉంది, యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను చుట్టూ ఉన్న తీరప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు, ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది. తన శిష్యులవైపు చూస్తూ, ఆయన ఇలా బోధించారు: “దీనులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. ఇప్పుడు ఆకలిగొనిన మీరు ధన్యులు, మీరు తృప్తిపొందుతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. మనుష్యకుమారుని నిమిత్తం ప్రజలు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, మిమ్మల్ని అవమానించి, మీరు చెడ్డవారని మీ పేరును తృణీకరించినప్పుడు మీరు ధన్యులు. “ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు. “కాని ధనవంతులారా మీకు శ్రమ, మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు. ఇప్పుడు కడుపు నింపుకొన్న వారలారా మీకు శ్రమ, మీరు ఆకలిగొంటారు. ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీకు శ్రమ, మీరు దుఃఖించి రోదిస్తారు. మనుష్యులందరు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ, వారి పూర్వికులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు. “అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి. ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి. మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు. ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. “ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పాపులు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు. ఒకవేళ మీరు మీకు మేలు చేసే వారికే మేలు చేస్తే, మీకేమి లాభం? పాపులు కూడ అలాగే చేస్తారు కదా! మీకు తిరిగి ఇవ్వగలిగిన వారికే మీరు ఇస్తే మీకేమి లాభం? మీరు కూడా తాము ఇచ్చింది తమకు పూర్తిగా తిరిగి వస్తుందని పాపులకే ఇస్తారు. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేనివారికి, దుష్టులకు కూడా దయ చూపించేవాడు. మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం కలవారై ఉండండి. “తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.” యేసు వారికి ఈ ఉపమానాన్ని కూడా చెప్పారు, “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపించగలడా? వారిద్దరు గుంటలో పడరా? ఒక శిష్యుడు బోధకుని కంటే ఉన్నతుడు కాడు, అయితే పూర్తిగా శిక్షణ పొందుకొన్నవాడు తన బోధకునిలా అవుతాడు. “నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవడం విఫలమైన నీవు నీ సహోదరునితో, ‘సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు’ అని నీవెలా అనగలవు? ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. “ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. ప్రతి చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. ప్రజలు ముళ్ళపొదల్లో అంజూర పండ్లను, లేదా గచ్చ పొదల్లో ద్రాక్షపండ్లను కోయరు. మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది. “నేను చెప్పే మాట ప్రకారం చేయకుండా ఎందుకు నన్ను ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుస్తున్నారు? నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు ఎలాంటివారో నేను మీకు చెప్తాను. లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, ఇల్లు కట్టిన వ్యక్తిలా ఉంటారు. వరదలు వచ్చి ప్రవాహాలు వేగంగా ఆ ఇంటిని తాకాయి కాని ఆ ఇంటిని ఏమి చేయలేకపోయాయి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఇంటిని బలమైన పునాది మీద కట్టుకున్నాడు. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాని లాంటివారు. వరద ప్రవాహం వేగంగా ఆ ఇంటిని తాకగానే, అది కూలి పూర్తిగా ధ్వంసం అయ్యింది.”
లూకా 6:12-49 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. వారు ఎవరంటే ఆయన పేతురు అని పిలిచిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను, యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు. ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు, “పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. “ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది. “ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. “మనుష్యకుమారుడి కారణంగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, అవమానించి మీరు చెడ్డవారంటూ మీ పేరును తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు. “అయ్యో, ధనికులారా, మీకు యాతన. మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీకు యాతన. మీకు ఆకలి వేస్తుంది. అయ్యో, ఇప్పుడు నవ్వుతున్న మీకు యాతన. మీరు దుఃఖించి ఏడుస్తారు. మనుషులంతా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు యాతన. వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్త లకు అలాగే చేశారు. “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి. నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా. మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా! మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి. ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది. ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.” తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా? శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు. నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు? నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో, ‘సోదరా, నీ కంట్లో నలుసు తీసివేయనియ్యి’ అని నువ్వెలా చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివెయ్యి. అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు. ఏ చెట్టయినా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకోరు. రక్కెస పొదలో ద్రాక్షపళ్ళు కోయరు. మంచి మనిషి తన హృదయమనే ధననిధిలో నుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో నిండి ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది. నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే, ‘ప్రభూ, ప్రభూ’ అని నన్ను పిలవడం ఎందుకు? “నా దగ్గరికి వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవరిని పోలి ఉంటాడో వినండి. వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు కనుక దాన్ని కదిలించలేక పోయింది. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది. ఆ ఇంటి నాశనం ఎంతో దయనీయం.”
లూకా 6:12-49 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా, సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు, అతని తమ్ముడు అంద్రెయ. యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతె అని పిలువబడే సీమోను యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు). యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు. యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు: “దీనులైన మీరు ధన్యులు. దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు. మీ ఆకలి తీరుతుంది. ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు. భవిష్యత్తులో మీరు నవ్వుతారు. “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు! మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు. “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు! మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు! కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు. మీకు ఆహారం దొరకదు! నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు! మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు! “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు. “కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి. “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు. అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు. “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి. “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.” ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్తారు కదా! శిష్యుడు తన గురువుకన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు. “నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు? నీ కంట్లో దూలం పెట్టుకొని, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు’ అని అతనితో ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా చూడ కలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తియ్యాలో తెలుసుకుంటావు. “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు. మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు. “నేను చెప్పింది చెయ్యకుండా నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలవటం ఎందుకు? నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి. అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు కూలి పోలేదు. “నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”
లూకా 6:12-49 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా–ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితోకూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్పసమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటినుండియు, యెరూషలేమునుండియు, తూరుసీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజనసమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి. ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నముచేసెను. అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను– బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా–మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవువానియొద్ద దాని మరల అడుగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను–గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో–సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక– ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను.