లూకా 6:12-16
లూకా 6:12-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా–ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు.
లూకా 6:12-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ రోజుల్లో ఒక రోజు యేసు ప్రార్థించడానికి కొండకు వెళ్లి, రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు. ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నుకొని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా “పిలువబడిన వారు” అని అర్థం. వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, అత్యాసక్తి కలవాడని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడైన యూదా, మరియు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
లూకా 6:12-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. వారు ఎవరంటే ఆయన పేతురు అని పిలిచిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను, యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు.
లూకా 6:12-16 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా, సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు, అతని తమ్ముడు అంద్రెయ. యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతె అని పిలువబడే సీమోను యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).