లూకా 4:38-44
లూకా 4:38-44 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు సమాజమందిరం నుండి బయటకు వచ్చి సీమోను ఇంటికి వెళ్లారు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది, కనుక వారు ఆమెకు సహాయం చేయమని యేసును అడిగారు. కనుక ఆయన ఆమె వైపుకు వంగి జ్వరాన్ని గద్దించారు, జ్వరం ఆమెను వదలిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచారం చేయడం మొదలు పెట్టింది. సూర్యుడు అస్తమించినప్పుడు, ప్రజలు వివిధ రోగాలు గలవారినందరిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతులుంచి, వారిని స్వస్థపరిచారు. అంతేకాక, చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేస్తూ బయటికి వచ్చాయి! కాని తాను క్రీస్తు అని వాటికి తెలుసు, కనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు. మరుసటిరోజు తెల్లవారగానే, యేసు ఏకాంత స్థలానికి వెళ్లారు. ప్రజలు ఆయనను వెదకుతూ ఆయన ఉన్నచోటుకు వచ్చి, ఆయనను వెళ్లిపోకుండా ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వారితో, “నేను ఇతర గ్రామాలలో కూడా దేవుని రాజ్యసువార్తను ప్రకటించాలి, అందుకొరకే నేను పంపబడ్డాను” అని వారితో చెప్పారు. మరియు ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాలలో ప్రకటిస్తూ ఉన్నారు.
లూకా 4:38-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు. ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది. పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు. వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు. తెల్లవారినప్పుడు ఆయన బయలుదేరి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఆయనను వెదుకుతూ ఆయన ఉన్న చోటికి వచ్చారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయనను ఆపాలని చూశారు. అయితే ఆయన, “నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దీని కోసమే దేవుడు నన్ను పంపాడు” అని వారితో చెప్పాడు. ఆపైన ఆయన యూదయ ప్రాంతమంతటా ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు.
లూకా 4:38-44 పవిత్ర బైబిల్ (TERV)
యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది. సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు. తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు. కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు. ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.
లూకా 4:38-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు–నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా ఆయన–నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.