లూకా 4:12-26
లూకా 4:12-26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది” అని అన్నారు. అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు. యేసు పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి గలిలయకు వెళ్లారు, అప్పుడు ఆయన గురించిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆయన వారి సమాజమందిరాలలో బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆయనను కొనియాడారు. యేసు తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్లినప్పుడు, అలవాటు ప్రకారం సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి, వాక్యాన్ని చదవడానికి నిలబడ్డారు. ఆయన చేతికి ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంథాన్ని వారు అందించారు. ఆయన ఆ గ్రంథపు చుట్టను విప్పుతుండగా ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉండడం కనిపించింది: “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించారు; చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి, గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి, బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి, ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు.” ఆ తర్వాత ఆ గ్రంథపు చుట్టను చుట్టి, అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి సారించారు. అప్పుడు ఆయన వారితో, “ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నారు. అందరు ఆయనను మెచ్చుకొంటూ ఆయన నోటి నుండి వచ్చే దయ గల మాటలకు ఆశ్చర్యపడి, “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అని వారు అడిగారు. యేసు వారితో మాట్లాడుతూ, “ ‘ఓ వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో!’ అనే సామెతను తప్పకుండా నాకు చెప్తారు, ఇంకా నాతో, ‘నీవు కపెర్నహూములో కార్యాలను చేసావని మేము విన్నట్లుగా, నీ సొంత గ్రామమైన ఇక్కడ కూడా చేయి’ అని మీరు అంటారు” అని అన్నారు. ఆయన వారితో ఇంకా మాట్లాడుతూ, “ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను. ఏలీయా ప్రవక్త రోజుల్లో మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి, దేశమంతట తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులలో అనేకమంది విధవరాండ్రు ఉన్నారని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే వారెవరి దగ్గరకు ఏలీయా పంపబడలేదు, సీదోను ప్రాంతంలోని సారెపతు గ్రామంలోని ఒక విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు.
లూకా 4:12-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు. ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు. యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే, “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ, ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు” అని రాసిన చోటు ఆయనకు దొరికింది. ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు. అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు. ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు. ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా, దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు. సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు.
లూకా 4:12-26 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’ అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు. యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది. ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు. ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు: “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు నన్ను సువార్త ప్రకటించుమన్నాడు. అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు. బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని, గుడ్డివారికి చూపు కలిగించాలని, హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు. ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.” ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు. అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు. “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.
లూకా 4:12-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువు ను శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా – –ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి–ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి–వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన–ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.