లూకా 23:44-49
లూకా 23:44-49 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి–ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్ర్తీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
లూకా 23:44-49 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు కాంతినివ్వలేదు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. అప్పుడు యేసు, “తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను” అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు. శతాధిపతి, జరిగింది చూసి, “ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు. ఈ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న ప్రజలందరు జరిగిందంతా చూసి, రొమ్ము కొట్టుకొంటూ తిరిగి వెళ్లిపోయారు. ఆయనతో పరిచయం ఉన్నవారందరు, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలతో సహా అందరు దూరంగా నిలబడి చూస్తున్నారు.
లూకా 23:44-49 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది. అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు. శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
లూకా 23:44-49 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర రెండు భాగాలుగా చినిగి పోయింది. యేసు బిగ్గరగా, “తండ్రి! నా ఆత్మను నీ చేతుల్లో పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు. శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు. ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు. కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు, యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని ఉన్నారు.