లూకా 23:33-37
లూకా 23:33-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతోకూడ సిలువవేసిరి. యేసు– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును–వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి –నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.
లూకా 23:33-37 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు. యేసు, “తండ్రీ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి” అని చెప్పారు. వారు చీట్లు వేసి ఆయన బట్టలను పంచుకున్నారు. ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు, అధికారులు కూడ, “వీడు ఇతరులను రక్షించాడు; వీడు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు. అప్పుడు సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిరకాను పులిసిన ద్రాక్షరసం అందించి, “నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.
లూకా 23:33-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు. అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు. ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు. ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.
లూకా 23:33-37 పవిత్ర బైబిల్ (TERV)
కల్వరి అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు. యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు” అని అన్నాడు. వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు. ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు. భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు.