లూకా 23:1-49
లూకా 23:1-49 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. వారు ఆయన మీద, “ఇతడు మన దేశాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు” అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు. అందుకు పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు. అందుకు అధిపతి పిలాతు, ముఖ్య యాజకులతో జనసమూహంతో, “ఇతనిలో నాకే దోషం కనిపించలేదు” అన్నాడు. అయినా వారు పట్టుబట్టి, “ఇతడు తన బోధలతో గలిలయ నుండి యూదయ ప్రాంతమంతట ప్రజలను రెచ్చగొడుతూ, ఇక్కడి వరకు వచ్చాడు” అన్నారు. ఇది విన్న పిలాతు, “ఈయన గలిలయుడా?” అని అడిగాడు. యేసు హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రాంతానికి చెందినవాడని పిలాతుకు తెలిసినప్పుడు, ఆ రోజు యెరూషలేములోనే ఉన్న హేరోదు దగ్గరకు ఆయనను పంపించాడు. హేరోదు చాలా కాలం నుండి యేసును చూడాలని ఆశపడ్డాడు, కాబట్టి ఆయనను చూడగానే అతడు చాలా సంతోషించాడు. యేసు గురించి తాను అనేక సంగతులను విన్నాడు కాబట్టి ఆయన ఏదైనా సూచకక్రియ చేస్తే చూడాలని ఆశించాడు. హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కాని యేసు వాటికి జవాబివ్వలేదు. ముఖ్య యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు నిలబడి, ఆయన మీద తీవ్ర నేరారోపణ చేశారు. హేరోదు అతని సైనికులు ఆయనను ఎగతాళి చేస్తూ అవమానపరిచారు, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి, వారు ఆయనను మరల పిలాతు దగ్గరకు పంపించారు. అంతకుముందు శత్రువులుగా ఉండిన హేరోదు పిలాతు ఆ రోజున స్నేహితులు అయ్యారు. తర్వాత పిలాతు ముఖ్య యాజకులను, అధికారులను ప్రజలను పిలిపించి, “ప్రజలను తిరుగుబాటు చేయిస్తున్నాడు అని మీరు ఈ మనుష్యుని నా దగ్గరకు తీసుకువచ్చారు. నేను మీ ముందే ఇతన్ని విచారించాను కానీ మీరు అతని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా ఇతనిలో నాకు కనబడలేదు. హేరోదుకు కూడా అతనిలో ఏ నేరం కనబడలేదని మరలా నా దగ్గరకు పంపించాడు; ఇదిగో, ఈయన మరణానికి తగిన నేరమేమి చేయలేదు. కాబట్టి నేను ఇతనికి శిక్షించి విడుదల చేస్తాను” అని వారితో చెప్పాడు. పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. అయితే వారందరు, “ఇతన్ని చంపి! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని కలిసికట్టుగా కేకలు వేశారు. ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు చేసినందుకు హత్య చేసినందుకు చెరసాలలో పెట్టబడ్డాడు. పిలాతు యేసును విడుదల చేయాలని, వారికి తిరిగి విజ్ఞప్తి చేశాడు. కానీ వారు, “వీనిని సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. మూడవసారి అతడు వారితో, “ఎందుకు? ఈ మనిషి చేసిన నేరమేంటి? ఇతనికి మరణశిక్షను విధించదగిన నేరమేమి నాకు కనబడలేదు. కాబట్టి ఇతన్ని శిక్షించి వదిలేస్తాను” అని వారితో చెప్పాడు. కాని వారు ఇంకా గట్టిగా కేకలువేస్తూ ఆయన సిలువవేయబడాలని పట్టుబట్టారు, చివరికి వారి కేకలే గెలిచాయి. కాబట్టి పిలాతు వారు కోరినట్లే చేయడానికి నిర్ణయించాడు వారు కోరుకున్న విధంగా తిరుగుబాటు హత్యానేరాలతో చెరసాలలో ఉన్న బరబ్బాను వారికి విడుదల చేసి, యేసును వారి ఇష్టానికి అప్పగించాడు. వారు ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్తుండగా, ప్రక్క గ్రామం నుండి వస్తున్న కురేనీయుడైన సీమోను అనే ఒకన్ని పట్టుకుని, యేసు వెనుక సిలువను మోయడానికి ఆ సిలువను అతని మీద పెట్టారు. దుఃఖిస్తూ విలపిస్తున్న స్త్రీలతో పాటు పెద్ద జనసమూహం ఆయనను వెంబడించారు. యేసు వారివైపు తిరిగి వారితో, “యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి; మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే ఒక సమయం రాబోతుంది అప్పుడు మీరు, ‘గొడ్రాళ్లు, కనని గర్భాలు, పాలియ్యని స్తనాలు ధన్యం అని అంటారు.’ అప్పుడు వారు, “పర్వతాలతో ‘మామీద పడండి!’ అని కొండలతో, ‘మమ్మల్ని కప్పండి!’ అని అంటారు. పచ్చగా ఉన్న చెట్టుకే వారు ఇలా చేస్తే, ఎండిన దానికి ఇంకా ఏమి చేస్తారు?” అని చెప్పారు. ఆయనతో పాటు మరి ఇద్దరు నేరస్థులను కూడ చంపడానికి తీసుకువచ్చారు. కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమవైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు. యేసు, “తండ్రీ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి” అని చెప్పారు. వారు చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు, అధికారులు కూడ, “వీడు ఇతరులను రక్షించాడు; వీడు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అని అంటూ ఎగతాళి చేశారు. అప్పుడు సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిరకాను పులిసిన ద్రాక్షరసం అందించి, “నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: ఇతడు యూదుల రాజు. వ్రేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయనను అవమానిస్తూ, “నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడ రక్షించు!” అని హేళన చేశాడు. కానీ మరొక నేరస్థుడు వానిని గద్దించి, “నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు, నీవు దేవునికి భయపడవా?” అన్నాడు. “మనం చేసిన తప్పులకు న్యాయంగానే శిక్షను అనుభవిస్తున్నాం కాని ఈయన ఏ తప్పు చేయలేదు” అన్నాడు. ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, “నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. యేసు వానితో, “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు. అప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు కాంతినివ్వలేదు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. అప్పుడు యేసు, “తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను” అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు. శతాధిపతి, జరిగింది చూసి, “నిజంగా ఈయన నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు. ఈ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న ప్రజలందరు జరిగిందంతా చూసి, రొమ్ము కొట్టుకొంటూ తిరిగి వెళ్లిపోయారు. ఆయనతో పరిచయం ఉన్నవారందరు, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలతో సహా అందరు దూరంగా నిలబడి చూస్తున్నారు.
లూకా 23:1-49 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. “ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు. అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి ఆయన, “నువ్వే అంటున్నావు కదా” అన్నాడు. పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు. అయితే వారు, “ఇతడు గలిలయ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు” అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు. పిలాతు ఈ మాట విని, “ఇతడు గలిలయ ప్రాంతం వాడా?” అని అడిగాడు. ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయనను హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు. హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయనను చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు. హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు. ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వారిద్దరూ స్నేహితులయ్యారు. అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించాడు. “ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు. హేరోదుకు కూడా ఏ దోషమూ కనిపించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదు. అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు. పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక. అయితే వారంతా, “వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి” అని ఒక్కపెట్టున కేకలు వేశారు. బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నాడు. పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు. కాని వారంతా, “వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి” అని మరింతగా కేకలు వేశారు. మూడవ సారి అతడు, “ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేశాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలేస్తాను” అన్నాడు. కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి, “వీణ్ణి సిలువ వేయండి” అని అరిచారు. చివరికి వారి కేకలే గెలిచాయి. వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు. వారు కోరినట్టే తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు. వారాయన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దాన్ని అతని మీద పెట్టారు. పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు. యేసు వారివైపు తిరిగి, “యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. వినండి, ‘గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం’ అని చెప్పే రోజులు వస్తున్నాయి. అప్పుడు ‘మా మీద పడండి’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పివేయండి’ అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలుపెడతారు. చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో” అని చెప్పాడు. ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు. వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు. అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు. ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు. ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. “ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు. వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు. కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు. తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది. అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు. శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
లూకా 23:1-49 పవిత్ర బైబిల్ (TERV)
మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి, “ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు. ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. “ఔను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు. కాని వాళ్ళు, “ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపుచున్నాడు. ఇది యితడు గలిలయలో ప్రారంభించి యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు. ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు. యేసు, హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు. హేరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహాత్యం చేస్తాడేమోనని ఆశించాడు. అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు. ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. పిలాతు ప్రధానయాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని, సమావేశపరిచాడు. వాళ్ళతో, “తిరుగుబాటు చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతణ్ణి మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనపడటంలేదు. హేరోదుకు కూడా ఏ తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం అతడు చెయ్యలేదని మీరు గమనించారు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు. వాళ్ళంతా ఒకే గొంతుతో, “అతణ్ణి చంపండి, బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు. బరబ్బ తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు. యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్ళీ విజ్ఞప్తి చేశాడు. కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు. మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను.” అని అన్నాడు. కాని, అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు. పిలాతు వాళ్ళడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు. తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్ళ కప్పగించాడు. వాళ్ళు యేసును తీసుకొని వెళ్తూ, గ్రామం నుండి పట్టణంలోకి వస్తున్న సీమోను అనే వాణ్ణి పట్టుకొని అతనిపై సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. సీమోను కురేనే గ్రామస్థుడు. చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ యేసు వెనుక నడిచారు. యేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీ కోసం, మీ సంతానం కోసం దుఃఖించండి. ‘గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి’ అనే రోజులు వస్తాయి. అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని అడుగుతారు. చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” అని అన్నాడు. మరణ దండన విధించటానికి, ఇద్దరు నేరస్థుల్ని కూడా యేసు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు. కల్వరి అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు. యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు” అని అన్నాడు. వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు. ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు. భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు. “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు. ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమానపరిచాడు. కాని మరొక నేరస్థుడు మొదటి వాణ్ణి గద్దిస్తూ, “నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే. మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు. ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు. యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో సహా పరదైసులో ఉంటావు” అని సమాధానం చెప్పాడు. అప్పుడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర రెండు భాగాలుగా చినిగి పోయింది. యేసు బిగ్గరగా, “తండ్రి! నా ఆత్మను నీ చేతుల్లో పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు. శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు. ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు. కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు, యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని ఉన్నారు.
లూకా 23:1-49 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి –ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి. పిలాతు– నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన–నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను–ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు–ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని–ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి. అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి –ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు; హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు–వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు–ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్ర్తీలును ఆయనను వెంబడించిరి. యేసు వారివైపు తిరిగి–యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో–గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి. అప్పుడు–మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను. మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతోకూడ సిలువవేసిరి. యేసు– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును–వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి –నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. –ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి–ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్ర్తీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
లూకా 23:1-49 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)