లూకా 22:60-71

లూకా 22:60-71 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అందుకు పేతురు, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్తుండగానే కోడి కూసింది. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసారు అప్పుడు పేతురు, “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని, బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు. యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. వారు ఆయన ముఖాన్ని కప్పి, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అన్నారు. ఆయనను దూషిస్తూ అనేక మాటలు అన్నారు. ఉదయం కాగానే ప్రజానాయకుల సభ, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సమావేశమయ్యారు, యేసు వారి ముందు నడిపించబడ్డారు. “నీవు క్రీస్తువైతే, మాతో చెప్పు” అన్నారు. అందుకు యేసు, “నేను మీతో చెప్పినా, మీరు నమ్మరు. ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినా, మీరు నాకు జవాబు చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్యకుమారుడు శక్తిగల దేవుని కుడి వైపున కూర్చుంటాడు” అని వారితో చెప్పారు. అందుకు వారందరు, “నీవు దేవుని కుమారుడవా?” అని అడిగారు. అందుకు ఆయన, “అని మీరే అంటున్నారు” అని వారితో చెప్పారు. అందుకు వారు, “మనకు ఇంకా సాక్ష్యం ఏం అవసరం? స్వయంగా ఇతడే తన నోటితో పలకడం విన్నాం” అన్నారు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:60-71 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది. అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు. ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు. ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు. ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు. “నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు. అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు. “అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు. అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:60-71 పవిత్ర బైబిల్ (TERV)

“అయ్యా! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు” అని పేతురు సమాధానం చెప్పాడు. అతడీ మాటలంటుండగానే కోడి కూసింది. ప్రభువు అటువైపు మళ్ళీ సూటిగా పేతురు వైపు చూశాడు. అప్పుడు ప్రభువు, “ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో తెలియదని మూడుసార్లంటావు” అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు. యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు. అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు. సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్ళు యేసును మహాసభ ముందుకు పిలుచుకు వచ్చారు. మహాసభ సభ్యులు, “నీవు క్రీస్తువైనట్లైతే మాతో చెప్పు” అని అన్నారు. యేసు, “నేను చెబితే మీరు నమ్మరు. నేను అడిగితే మీరు చెప్పరు. కాని యిప్పటినుండి మనుష్య కుమారుడు సర్వశక్తిసంపన్నుడైన దేవుని యొక్క కుడివైపున కూర్చుంటాడు” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు, “నీవు దేవుని కుమారునివా?” అని అడిగారు. ఆయన, “మీరన్నది నిజం” అని అన్నాడు. ఆ తదుపరి వాళ్ళు, “మనకిక ఇతర సాక్ష్యాలు ఎందుకు? స్వయంగా అతని నోటినుండే విన్నాము” అని అన్నారు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:60-71 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అందుకు పేతురు–ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు–నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి, –నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయముకాగానే ప్రజల పెద్దలును ప్రధానయాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి –నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన – నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరు–అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన–మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు–మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.

షేర్ చేయి
Read లూకా 22