లూకా 22:20-38

లూకా 22:20-38 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అలాగే, భోజనం చేసిన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కొరకు కార్చబడు నా రక్తంలో క్రొత్త నిబంధన. కాని నన్ను అప్పగించబోయే వాని చెయ్యి నాతో కూడ ఈ బల్ల మీద ఉంది. నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లిపోతారు, కాని ఆయనను అప్పగించే వానికి శ్రమ!” అని అన్నారు. అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది. యేసు వారితో, “యూదులు కాని రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చెలాయించేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు. కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి సేవకునిగా ఉండాలి. అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేక సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్న వాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను. మీరైతే నా శోధన సమయంలో నాతో నిలిచి ఉన్నవారు. గనుక నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా, నా రాజ్యంలో మీరు నా భోజనబల్ల దగ్గర కూర్చుని అన్నపానాలను పుచ్చుకొంటూ, సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహించాను. “సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు. కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థించాను. అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పారు. కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు. అందుకు యేసు, “పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను” అన్నారు. ఇంకా ఆయన, “మీకు డబ్బు సంచి, సంచి, చెప్పులు లేకుండ నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా?” అని వారిని అడిగారు. దానికి వారు “ఏమి తక్కువ కాలేదు” అన్నారు. అందుకు ఆయన వారితో, “అయితే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర డబ్బు సంచి ఉంటే, దాన్ని తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర ఖడ్గం లేకపోతే, మీ పైబట్టను అమ్మి ఖడ్గాన్ని కొనుక్కోవాలి. ‘ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు’ అని వ్రాయబడి ఉంది; నా విషయంలో ఇది నెరవేర్చబడాలి. అవును, నా గురించి వ్రాయబడినవి నెరవేరబోతున్నాయి” అని అన్నారు. శిష్యులు, “ఇదిగో ప్రభువా, ఇక్కడ రెండు ఖడ్గాలు ఉన్నాయి” అన్నారు. ఆయన వారితో “అవి చాలు!” అని జవాబిచ్చారు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:20-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన. “వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు. దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు, ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను. “నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు. నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి, సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను. “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.” కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు. అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు. ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు. ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి. ‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:20-38 పవిత్ర బైబిల్ (TERV)

అదే విధంగా భోజనం అయ్యాక ఆయన పాత్రను తీసుకొని, “ఇది నా రక్తంతో చేసిన క్రొత్త నిబంధన. నేను ఈ రక్తాన్ని మీకోసం చిందిస్తున్నాను. “నాకు ద్రోహం చేయబోతున్నవాడు నాతో యిక్కడ భోజనానికి కూర్చొని ఉన్నాడు. దేవుడు నిర్ణయించినట్లు మనుష్యకుమారుడు మరణించబోతున్నాడు. ఆయనకు ద్రోహం చేసిన వానికి శిక్ష తప్పదు” అని అన్నాడు. వాళ్ళు తమలో, “ఎవరీపని చేస్తారా?” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది. యేసు వాళ్ళతో, “యూదులుకాని వాళ్ళను, వాళ్ళ రాజులు క్రూరంగా పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు. కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి. నాయకుడు సేవకునిలా ఉండాలి. ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను. “మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్నవాళ్ళు. కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి నట్లు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను. అప్పుడు మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చొని తింటారు. సింహాసనాలపై కూర్చుని పండ్రెండు వంశాల వారిపై తీర్పు చేస్తారు. “సీమోనూ! సీమోనూ! మిమ్మల్ని గోధుమలు చెరిగినట్లు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి పొందాడు. కాని సీమోనూ! నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లరాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్ళీ బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టిపరుచు” అని అన్నాడు. కాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం చెప్పాడు. యేసు, “పేతురూ! నేను చెప్పేది విను. ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో నీకు తెలియదని మూడు సార్లంటావు” అని అన్నాడు. ఆ తర్వాత యేసు, “నేను మిమ్మల్ని డబ్బు దాచుకొనే సంచీ, చేతి సంచీ, చెప్పుల జోళ్ళూ లేకుండా పంపినప్పుడు మీ అవసరాలు తీరలేదా?” అని అడిగాడు. “తీరాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “ఇప్పుడు మీ దగ్గర డబ్బులు దాచుకొనే సంచి ఉంటే దాన్ని మీ వెంట తీసుకెళ్ళండి. మీ దగ్గర కత్తి లేకుంటే మీ వస్త్రాన్ని అమ్మి కత్తి కొనండి. లేఖనాల్లో, ‘అతడు నేరస్థునిగా పరిగణింపబడ్డాడు’ అని వ్రాయబడి ఉంది. అది నా విషయంలో నిజమౌతుంది. ఔను! అది యిప్పుడు నా విషయంలో నిజమౌతుంది!” అని అన్నాడు. శిష్యులు ఆయనతో, “ఇదిగో ప్రభూ! యిక్కడ రెండు కత్తులున్నాయి” అని అన్నారు. “ఆ విషయం ఇక చాలించండి” అని ఆయన అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:20-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను –అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను. నా శోధనలలో నాతోకూడ నిలిచియున్నవారు మీరే; గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనములమీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు –ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన–పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను. మరియు ఆయన–సంచియు జాలెయు చెప్పులునులేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు–ఏమియు తక్కువకాలేదనిరి. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను; –ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను. వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా–చాలునని ఆయన వారితో చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:20-38

లూకా 22:20-38 TELUBSI