లూకా 22:19-27
లూకా 22:19-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను –అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను.
లూకా 22:19-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు. అలాగే, భోజనం చేసిన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కొరకు కార్చబడు నా రక్తంలో క్రొత్త నిబంధన. కాని నన్ను అప్పగించబోయే వాని చెయ్యి నాతో కూడ ఈ బల్ల మీద ఉంది. నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లిపోతారు, కాని ఆయనను అప్పగించే వానికి శ్రమ!” అని అన్నారు. అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది. యేసు వారితో, “యూదులు కాని రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చెలాయించేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు. కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి సేవకునిగా ఉండాలి. అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేక సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్న వాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను.
లూకా 22:19-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు. అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన. “వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు. దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు, ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.
లూకా 22:19-27 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని త్రుంచి వాళ్ళకిస్తూ, “ఇది నా శరీరం. మీకోసం యివ్వబడింది. నా జ్ఞాపకార్థం యిది చెయ్యండి” అని అన్నాడు. అదే విధంగా భోజనం అయ్యాక ఆయన పాత్రను తీసుకొని, “ఇది నా రక్తంతో చేసిన క్రొత్త నిబంధన. నేను ఈ రక్తాన్ని మీకోసం చిందిస్తున్నాను. “నాకు ద్రోహం చేయబోతున్నవాడు నాతో యిక్కడ భోజనానికి కూర్చొని ఉన్నాడు. దేవుడు నిర్ణయించినట్లు మనుష్యకుమారుడు మరణించబోతున్నాడు. ఆయనకు ద్రోహం చేసిన వానికి శిక్ష తప్పదు” అని అన్నాడు. వాళ్ళు తమలో, “ఎవరీపని చేస్తారా?” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది. యేసు వాళ్ళతో, “యూదులుకాని వాళ్ళను, వాళ్ళ రాజులు క్రూరంగా పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు. కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి. నాయకుడు సేవకునిలా ఉండాలి. ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను.