లూకా 20:34-38
లూకా 20:34-38 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు యేసు, “ఈ యుగానికి చెందినవారు పెళ్ళి చేసుకొంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు గాని మృతుల పునరుత్థానం పొంది రానున్న యుగానికి యోగ్యులుగా ఎంచబడేవారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు ఎన్నడు చావనే చావరు. దూతల్లా ఉంటారు. వారు పునరుత్థాన సంతానంగా దేవుని పిల్లలు అవుతారు. అయితే మృతులు తిరిగి లేచే విషయం చెప్తూ ఇలా అన్నారు: మండుచున్న పొద సంఘటనలో మోషే ‘మన పూర్వికులైన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు’ అని చెప్తూ మృతులు లేస్తారని సూచించాడు. ఆయన దృష్టిలో అందరు జీవించేవున్నారు కనుక ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు.” అని వారికి జవాబిచ్చారు.
లూకా 20:34-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు యేసు, “ఈ లోక ప్రజలు పెళ్ళికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ, పరలోకంలో నిత్యజీవానికీ, మృతుల పునరుత్థానానికీ అర్హులు ఆ కాలంలో పెళ్ళి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు. వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు. మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా, ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ సజీవులే” అని వారికి జవాబిచ్చాడు.
లూకా 20:34-38 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు. పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు. వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’ అని వ్రాసాడు. ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు.
లూకా 20:34-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు యేసు–ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు. పొదనుగురించిన భాగములో –ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను.