లూకా 2:13-19
లూకా 2:13-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు, “అత్యున్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక.” ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, “రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం” అని చెప్పుకొన్నారు. కనుక వారు త్వరపడి వెళ్లి మరియను యోసేపును మరియు తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసారు వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్న వారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది.
లూకా 2:13-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి, “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు. ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసికందును చూశారు. ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది.
లూకా 2:13-19 పవిత్ర బైబిల్ (TERV)
తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు: “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక! భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!” దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు. వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు. ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది.
లూకా 2:13-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతోకూడనుండి –సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు–జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.