లూకా 2:1-40

లూకా 2:1-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియైయుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొకతొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతోకూడనుండి –సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు–జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రముచొప్పునవారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు –ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు కు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి. యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మ వశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను – –నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమెయోను వారిని దీవించి–ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవస్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెని మిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయననుగూర్చి మాటలాడుచుండెను. అంతట వారు ప్రభువు ధర్మశాస్ర్తము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.

షేర్ చేయి
Read లూకా 2

లూకా 2:1-40 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞ జారీ చేశాడు. (ఇది కురేనియు సిరియాదేశ అధిపతిగా ఉన్నప్పుడు తీసిన మొదటి ప్రజాసంఖ్య.) ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు. కాబట్టి యోసేపు కూడా దావీదు వంశస్థుడు కనుక, అతడు గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి, యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే దావీదు పట్టణానికి వెళ్లాడు, ఎందుకంటే అతడు దావీదు వంశస్థుడు. తనతో పెండ్లికి ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉన్న మరియతో పాటు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు. వారు అక్కడ ఉన్నపుడు, ఆమె నెలలు నిండి, తన తొలి కుమారుని కన్నది. సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కనుక ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి వేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు. అయితే ఆ దూత వారితో, “భయపడకండి, ప్రజలందరికి గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెచ్చాను. దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కొరకు పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు. మీరు గుర్తు పట్టడానికి మీకు గుర్తు ఇదే: ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండడం మీరు చూస్తారు” అని చెప్పాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు, “అత్యున్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక.” ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, “రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం” అని చెప్పుకొన్నారు. కనుక వారు త్వరపడి వెళ్లి మరియను యోసేపును మరియు తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసారు వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్న వారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు. ఆ శిశువుకు సున్నతి చేయాల్సిన ఎనిమిదవ రోజున, ఆయనను గర్భం దాల్చక ముందు దేవదూత చెప్పినట్లు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత, యోసేపు మరియలు ఆ శిశువును ప్రభువునకు ప్రతిష్ఠించడానికి యెరూషలేముకు తీసుకువెళ్ళారు. (ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లుగా, “ప్రతి తొలి మగబిడ్డ ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి”), మరియు ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: “గువ్వల జతను, లేక రెండు చిన్న పావురాలను” బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళారు. ఆ సమయంలో యెరూషలేములో నీతిమంతుడు మరియు భక్తిపరుడైన, సుమెయోను అని పిలువబడే ఒక వృద్ధుడున్నాడు. అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది. అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు, సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకొని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు: “ సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు. ఎందుకంటే నా కళ్ళు నీ రక్షణను చూసాయి, దేన్నైతే సర్వలోక ప్రజల కొరకు నీవు సిద్ధపరచావో: యూదులు కాని వారందరికి ప్రత్యక్షత కొరకైన వెలుగుగా, మరియు నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా.” ఆయన గురించి చెప్పిన మాటలను విన్న ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. సుమెయోను వారిని దీవించి ఆయన తల్లియైన మరియతో: “ఇశ్రాయేలీయులలో అనేకమంది పడిపోవడానికి మరియు లేవడానికి కారణంగాను, వ్యతిరేకంగా చెప్పుకోడానికి గుర్తుగాను ఉండడానికి ఈ శిశువు నియమించబడ్డాడు, తద్వారా అనేకమంది హృదయాలోచనలు బయలుపరచబడతాయి, నీ హృదయంలోనికి కూడా ఒక ఖడ్గం దూసికొనిపోతుంది.” అలాగే ఆషేరు గోత్రానికి చెందిన, పనూయేలు కుమార్తెయైన, అన్న, అనే ఒక ప్రవక్తి కూడా అక్కడ ఉండింది. ఆమె చాలా వృద్ధురాలు; ఆమె పెళ్ళి చేసుకొని ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి, తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండే వరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది. ఆమె కూడ ఆ సమయంలోనే దేవాలయ ఆవరణంలో వారి దగ్గరకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, యెరూషలేము విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారందరితో శిశువు గురించి చెప్పింది. యోసేపు మరియలు ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం అన్ని జరిగించిన తర్వాత, గలిలయలోని నజరేతు అనే తమ పట్టణానికి వెళ్లారు. బాలుడు ఎదిగి బలం పొందుకొన్నాడు; ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, మరియు దేవుని దయ ఆయన మీద ఉండింది.

షేర్ చేయి
Read లూకా 2

లూకా 2:1-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు. ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య. అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు. యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు. తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు. వారక్కడ ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు. ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు. అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను. దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు. ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి, “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు. ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసికందును చూశారు. ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు. ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు. యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు. సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు, “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా! అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.” యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు. అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.” దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది. ఆ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్ళిపోయారు. పసివాడు ఎదుగుతూ, బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.

షేర్ చేయి
Read లూకా 2

లూకా 2:1-40 పవిత్ర బైబిల్ (TERV)

ఇది యిలా వుండగా రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు. కురేనియ సిరియ దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి యూదయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బేత్లెహేము అని అనే వాళ్ళు. మరియతో ఇతనికి పెళ్ళి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోటానికి వెళ్ళాడు. వాళ్ళక్కడ ఉండగా ఆమెకు ప్రసవవేదన వచ్చింది. ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది. ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొఱ్ఱెల కాపరులు రాత్రివేళ తమ గొఱ్ఱెల్ని కాపలాకాస్తూ ఉన్నారు. ఒక దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు. ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను. దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభువు. మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు. తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు: “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక! భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!” దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు. వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు. ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది. గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు. ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు. ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి” అని వ్రాయబడి ఉంది. అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు. ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు: “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు. నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను. నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు! యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!” యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.” ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది. మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది. ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. యేసు పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది.

షేర్ చేయి
Read లూకా 2