లూకా 19:12-23

లూకా 19:12-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“గొప్ప జన్మించిన వ్యక్తి సుదూర దేశానికి వెళ్లి తనను తాను రాజుగా నియమించుకొని తిరిగి వచ్చేయాలి. అందుకతడు తన పదిమంది సేవకులను పిలిచి వారికి పది మినాలను ఇచ్చి, ‘నేను తిరిగి వచ్చేవరకు, వీటితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు. “కాని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు కాబట్టి, ‘ఇతడు మాకు రాజుగా వద్దు’ అనే సందేశాన్ని అతనికి పంపించారు. “ఎలాగైతేనేం, అతడు రాజ్యాన్ని స్వాధీనపరచుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. తర్వాత అతడు తాను డబ్బు ఇచ్చిన సేవకులు దానితో ఏమి లాభం పొందారో తెలుసుకోవడానికి వారిని పిలిపించాడు. “మొదటివాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా పది మినాలను సంపాదించింది’ అని చెప్పాడు. “ఆ యజమాని, ‘భళా, మంచి దాసుడా! నీవు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, కాబట్టి పది పట్టణాల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను’ అని వానితో చెప్పాడు. “తర్వాత రెండవవాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా అయిదు మినాలు సంపాదించింది’ అని చెప్పాడు. “అతని యజమాని అతనితో, ‘నిన్ను అయిదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు. “అప్పుడు మరొకడు వచ్చి, ‘అయ్యా, నీవు పెట్టని చోట తీసుకునే, విత్తని చోట పంటను కోసే కఠినుడవని భయపడి, ఇదిగో నీవు ఇచ్చిన ఈ మినాను రుమాలులో దాచి పెట్టాను’ అన్నాడు. “అందుకు ఆ యజమాని, ‘చెడ్డ దాసుడా, నీ నోటి మాటతోనే నీకు తీర్పు తీరుస్తాను! నేను పెట్టని చోట తీసుకొనేవాడినని, విత్తని చోట పంటను కోసేవాడినని, కఠినుడనని నీకు తెలుసు, అవునా? అలాంటప్పుడు నీవు నా సొమ్మును, నేను తిరిగివచ్చిన తర్వాత, వడ్డీతో సహా తీసుకునేలా, వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు?’ అన్నాడు.

షేర్ చేయి
చదువండి లూకా 19

లూకా 19:12-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు. దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు. అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు. అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు. “మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది” అన్నాడు. దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు. యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం. దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు. అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి

షేర్ చేయి
చదువండి లూకా 19

లూకా 19:12-23 పవిత్ర బైబిల్ (TERV)

“గొప్ప కుంటుంబంలో పుట్టినవాడొకడు దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింపబడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు. వెళ్ళేముందు తన సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనాయిచ్చి, ‘నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి’ అని అన్నాడు. అతని ప్రజలకు అతడంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ ప్రతినిధుల్ని పంపి, ‘ఇతడు మా రాజుగా ఉండటం మాకిష్టం లేదు’ అని చెప్పనంపారు. “అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు. మొదటి వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక పది మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు. “రెండవ వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో ఐదు మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు. “మూడవవాడు వచ్చి, ‘ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను. మీరు చాలా కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయాలంటారు’ అని అన్నాడు. “ఆ రాజు, ‘ఓరి, దుర్మార్గుడా! నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా ఫలం పొందుతానన్నమాట. అలాంటప్పుడు నా డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది కదా!’ అని అన్నాడు.

షేర్ చేయి
చదువండి లూకా 19

లూకా 19:12-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి–నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి–ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన యెదుటికి వచ్చి–అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా అతడు–భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. అంతట రెండవవాడు వచ్చి–అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా అతడు–నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను. అంతట మరియొకడు వచ్చి–అయ్యా, యిదిగో నీ మినా; నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడుచెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయు వాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి

షేర్ చేయి
చదువండి లూకా 19