లూకా 18:31-34
లూకా 18:31-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి–ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెర వేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవదినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
లూకా 18:31-34 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు తన పన్నెండు మంది శిష్యులను ఒక ప్రక్కకు పిలిచి, “రండి, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుని గురించి ప్రవక్తలు వ్రాసిన మాటలన్నీ నెరవేరుతాయి. వారు ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి ఆయనను అవమానపరుస్తారు. వారు ఆయనను కొరడాలతో కొట్టి చంపేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు. ఆయన చెప్పిన ఈ మాటల్లో శిష్యులు ఏది గ్రహించలేదు. దాని అర్థం వారికి మరుగు చేయబడింది కనుక ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో వారికి తెలియలేదు.
లూకా 18:31-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి. ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు. ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు. వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.
లూకా 18:31-34 పవిత్ర బైబిల్ (TERV)
యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి. ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు, కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు. శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.