లూకా 18:22-30

లూకా 18:22-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగివుంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు. అయితే ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తిగలవాడు. యేసు అతన్ని చూసి అతనితో, “ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు. ఇది విన్న వారు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు. అందుకు యేసు, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం” అని జవాబిచ్చాడు. పేతురు ఆయనతో, “మేము మాకు కలిగిన వాటన్నింటిని విడిచి నిన్ను వెంబడించాము” అన్నాడు. అందుకు యేసు వారితో, “నేను నిజంగా మీతో చెప్పేది ఏంటంటే, దేవుని రాజ్యం కొరకు తన ఇంటిని, భార్యను, సహోదరులను, సహోదరీలను, తల్లిదండ్రులను, పిల్లలను విడిచిపెట్టిన వారు ఈ యుగంలో చాలారెట్లు పొందుకోవడమే కాక, రాబోయే యుగంలో నిత్యజీవాన్ని కూడా తప్పక పొందుకొంటాడు” అని వారితో అన్నారు.

షేర్ చేయి
Read లూకా 18

లూకా 18:22-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు. ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 18

లూకా 18:22-30 పవిత్ర బైబిల్ (TERV)

ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది. యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు. ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు. “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు. పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు. యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 18

లూకా 18:22-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు విని–నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి –ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను. ఇది వినినవారు–ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన–మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు– ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన–దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

షేర్ చేయి
Read లూకా 18