లూకా 18:18-25
లూకా 18:18-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒక అధికారి ఆయనను చూచి–సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను. అందుకు యేసు–నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలి దండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. అందుకతడు–బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను. యేసు విని–నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి –ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.
లూకా 18:18-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒక అధికారి యేసుతో, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు. మీకు ఆజ్ఞలు తెలుసు: ‘వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తల్లిదండ్రులను గౌరవించాలి’ ” అని అన్నారు. అందుకు ఆ అధికారి, “చిన్నప్పటి నుండి నేను వీటిని పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగివుంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు. అయితే ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తిగలవాడు. యేసు అతన్ని చూసి అతనితో, “ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
లూకా 18:18-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు. దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.
లూకా 18:18-25 పవిత్ర బైబిల్ (TERV)
ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు. “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు. “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు. ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది. యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.