లూకా 17:31-37
లూకా 17:31-37 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ రోజు ఇంటిపైన ఉన్న వారెవరు ఇంట్లో నుండి తమ వస్తువులను తెచ్చుకోవడానికి క్రిందికి దిగి వెళ్లకూడదు. అలాగే పొలంలో ఉన్నవారు ఏమైనా తెచ్చుకోడానికి తిరిగి వెనక్కి వెళ్లకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని కాపాడుకొంటారు. ఆ రాత్రి ఒకే పరుపు మీద ఉన్న ఇద్దరిలో, ఒకరు తీసుకుపోబడతారు ఇంకొకరు విడవబడతారు. ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగలి విసురుతుంటారు; ఒక స్త్రీ తీసుకుపోబడుతుంది, ఇంకొక స్త్రీ విడవబడుతుంది. [ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు; ఒకడు కొనిపోబడతాడు మరొకడు విడవబడుతాడు” అని చెప్పారు.] అందుకు శిష్యులు, “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” అని యేసును అడిగారు. అందుకు యేసు, “పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి” అని వారికి జవాబిచ్చారు.
లూకా 17:31-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.” అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు. దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.
లూకా 17:31-37 పవిత్ర బైబిల్ (TERV)
“ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు. లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి. “తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు. ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు. “ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు. ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు.
లూకా 17:31-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినమున మిద్దెమీదఉండు వాడు ఇంటఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్ర్తీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను. శిష్యులు–ప్రభువా, యిది ఎక్కడ (జరుగు) నని ఆయన నడిగినందుకు ఆయన–పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.