లూకా 17:11-19
లూకా 17:11-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు సమరయ మరియు గలిలయ ప్రాంతాల సరిహద్దుల గుండా యెరూషలేముకు వెళ్లారు. ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించేటప్పుడు పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు దూరంగా నిలబడి, “యేసూ, బోధకుడా, మమ్మును కనికరించండి!” అంటూ బిగ్గరగా కేక వేశారు. ఆయన వారిని చూసి, వారితో, “మీరు వెళ్లి, మిమ్మల్ని మీరు యాజకులకు కనపరచుకోండి” అన్నారు. వారు వెళ్తుండగానే వారు శుద్ధులయ్యారు. అందులో ఒకడు, తనకు స్వస్థత కలిగిందని చూసుకొని, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చాడు. అతడు యేసు పాదాల ముందు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయుడు. యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? ఈ సమరయుడు తప్ప దేవుని స్తుతించడానికి ఇంకా ఎవ్వరు తిరిగి రాలేదా?” అని అడిగారు. ఆ తర్వాత వానితో, “నీవు లేచి వెళ్లు; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు.
లూకా 17:11-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు. అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ? దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు. “నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
లూకా 17:11-19 పవిత్ర బైబిల్ (TERV)
యేసు యెరూషలేముకు ప్రయాణం సాగిస్తూ గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు. ఒక గ్రామంలోకి వెళ్తూండగా పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని, “యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు. ఆయన వాళ్ళను చూసి, “వెళ్ళి యాజకులకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు వెళ్తూంటే వాళ్ళకు నయమైపోయింది. వాళ్ళలో ఒకడు తనకు నయమవటం గమనించి, గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ వెనక్కు వెళ్ళాడు. యేసు ముందు మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకున్నాడు. అతడు సమరయ వాడు. యేసు, “పది మందికి నయమైంది కదా! మిగతా తొమ్మిది మంది ఏరి? ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?” అని అన్నాడు. ఆ తర్వాత అతనితో, “లేచి వెళ్ళు, నీ విశ్వాసమే నీకు నయం చేసింది” అని అన్నాడు.
లూకా 17:11-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయలమధ్యగా వెళ్లుచుండెను. ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి –యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి –నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.