లూకా 14:7-14

లూకా 14:7-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. –నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి –ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి–స్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండువారందరియెదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను– నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుప కారము కలుగును. అయితే నీవు విందుచేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 14

లూకా 14:7-14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆహ్వానించబడిన వారు భోజనబల్ల దగ్గర గౌరవ స్థానాలను ఎంచుకోవడం గమనించి, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఎవరైనా మిమ్మల్ని వివాహ విందుకు ఆహ్వానించినప్పుడు, గౌరవ స్థానాన్ని తీసుకోకండి, ఎందుకంటే మీ కంటే ఎక్కువ ప్రముఖ వ్యక్తి ఆహ్వానించబడి ఉండవచ్చు. ఆ అతిథి వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించినవారు నీ దగ్గరకు వచ్చి, ‘మీ స్థానాన్ని వీరికివ్వండి’ అని అంటాడు. అప్పుడు, అవమానంతో, ఎక్కడో చివరి స్థానంలో కూర్చోవలసి వస్తుంది. అలా కాకుండ, నీవు ఆహ్వానించబడినప్పుడు, నీవు చివరి స్థానంలో కూర్చో, అప్పుడు నిన్ను ఆహ్వానించినవారు వచ్చినప్పుడు, అతడు నీతో, ‘స్నేహితుడా, నీవు లేచి ముందున్న ముఖ్య స్థానంలో కూర్చో’ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర అతిథులందరి ముందు నీవు గౌరవించబడతావు. ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనేవారు తగ్గింపబడతారు, తనను తాను తగ్గించుకొనేవారు హెచ్చింపబడతారు” అన్నారు. తర్వాత యేసు తనను ఆహ్వానించిన వానితో, “నీవు మధ్యాహ్న భోజనం గానీ రాత్రి భోజనం గానీ పెట్టినప్పుడు, నీ స్నేహితులనే గానీ, సహోదరులు లేక సహోదరీలనే గానీ, బంధువులనే గానీ, ధనికులైన పొరుగువారినే గానీ ఆహ్వానించవద్దు; ఒకవేళ నీవు అలా చేస్తే, వారు కూడా తమ విందులకు నిన్ను ఆహ్వానించి నీ రుణాన్ని తీర్చేసుకుంటారు. అయితే నీవు విందును ఏర్పాటు చేసినప్పుడు పేదలను, కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను ఆహ్వానించు, అప్పుడు నీవు దీవించబడతావు. పిలువబడిన వారు నీకు తిరిగి ఏమి ఇవ్వలేకపోయినా, నీతిమంతుల పునరుత్థానంలో నీకు తిరిగి ఇవ్వబడుతుంది” అన్నారు.

షేర్ చేయి
Read లూకా 14

లూకా 14:7-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు, “నిన్ను ఎవరైనా పెళ్ళి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు. మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి, ‘ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు. కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.’ అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది. తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది.” తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, “నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు. అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు. నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది” అని చెప్పాడు.

షేర్ చేయి
Read లూకా 14

లూకా 14:7-14 పవిత్ర బైబిల్ (TERV)

విందులకు వచ్చిన అతిథులు గౌరవ స్థానం ఆక్రమించుట గమనించి యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీరు పెళ్ళి విందుకు ఆహ్వానింపబడినప్పుడు, మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించబడి ఉండవచ్చు. కనుక ముందు స్థానాల్లో కూర్చోకండి. అలాచేస్తే ఆ యింకొక వ్యక్తిని ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘ఈ స్థలం యితనికి యివ్వు’ అని అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న స్థలంలో కూర్చోవలసి వస్తుంది. “అందువల్ల నిన్ను ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ‘మిత్రమా! ముందుకు వచ్చి మంచి స్థలంలో కూర్చో’ అని అంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించినవాడు అల్ప స్థానానికి దించబడతాడు. తనంతట తాను అల్ప స్థానాన్ని ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.” అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి. వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 14