లూకా 13:1-30

లూకా 13:1-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అక్కడ ఉండిన ప్రజలలో కొందరు యేసుతో, పిలాతు గలిలయుల రక్తాన్ని బలులతో కలిపిన సంగతిని చెప్పారు. అందుకు యేసు, “ఈ గలిలయులు అలా శ్రమను అనుభవించారు కాబట్టి మిగిలిన గలిలయుల కంటే వీరు ఘోర పాపులని మీరు అనుకుంటున్నారా? నేను మీతో చెప్తున్నా, కాదు అని! మీరు పశ్చాత్తాపపడితేనే తప్ప, లేకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. సిలోయము గోపురం కూలి దాని క్రిందపడి పద్దెనిమిది మంది చనిపోయారు, వారు యెరూషలేములో జీవిస్తున్న వారందరికంటే ఎక్కువ పాపం చేశారని అనుకుంటున్నారా? నేను మీతో చెప్తున్నా, కాదు! అయితే మీరు పశ్చాత్తాపపడితేనే తప్ప, లేకపోతే మీరందరు కూడా అలాగే నశిస్తారు.” తర్వాత ఆయన ఈ ఉపమానం చెప్పారు: “ఒక మనుష్యుడు తన ద్రాక్షతోటలో ఒక అంజూరపు చెట్టును పెంచుతున్నాడు, అతడు వెళ్లి పండ్ల కొరకు ఆ చెట్టును చూసాడు కాని ఏమి దొరకలేదు. కనుక అతడు తోటమాలితో, ‘ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపుచెట్టు పండ్ల కొరకు వచ్చి చూస్తున్నాను గాని ఇంతవరకు ఏమి దొరకలేదు. దీనిని నరికివేయి! దీని వల్ల భూసారం ఎందుకు వృధా అవ్వాలి?’ అని అన్నాడు. “అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, ఇంకొక సంవత్సరం దానిని ఉండనివ్వండి, నేను దాని చుట్టు త్రవ్వి, ఎరువు వేసి చూస్తాను. ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.” ఒక సబ్బాతు దినాన యేసు సమాజమందిరంలో బోధిస్తున్నారు, అక్కడ పద్దెనిమిది ఏండ్ల నుండి అపవిత్రాత్మ చేత పట్టబడి నడుము వంగిపోయి నిటారుగా నిలబడలేకపోతున్న ఒక స్త్రీ ఉండింది. యేసు ఆమెను చూసి, ముందుకు రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు” అని చెప్పారు. తర్వాత ఆయన ఆమె మీద చేతులుంచారు, వెంటనే ఆమె నిటారుగా నిలబడి దేవుని స్తుతించింది. సబ్బాతు దినాన యేసు స్వస్థపరిచారని, ఆ సమాజమందిరపు అధికారి మండిపడి ప్రజలతో, “పని చేసుకోడానికి ఆరు దినాలు ఉన్నాయి. కనుక ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందండి, అంతేకాని సబ్బాతు దినాన కాదు” అని చెప్పాడు. అందుకు ప్రభువు అతనితో, “వేషధారులారా! మీలో ప్రతివాడు సబ్బాతు దినాన తన ఎద్దును గాని గాడిదను గాని పశువులశాల దగ్గరి నుండి వాటిని విప్పి తోలుకొనిపోయి వాటికి నీళ్ళు పెట్టరా? అలాంటప్పుడు అబ్రాహాము కుమార్తెయైయుండి, పద్దెనిమిది ఏండ్లు సాతాను చేత బంధించబడివున్న ఈ స్త్రీని సబ్బాతు దినాన ఎందుకు విడిపించకూడదు?” అని ప్రశ్నించారు. ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, ఆయనను వ్యతిరేకించిన వారందరు సిగ్గుపడ్డారు, కానీ ప్రజలందరు ఆయన చేస్తున్న మహత్కార్యాలను చూసి సంతోషించారు. అప్పుడు యేసు వారిని, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? అని అడిగి, అది ఒక ఆవగింజ లాంటిది, ఒకడు దాన్ని తీసుకెళ్ళి తన పొలంలో నాటాడు. అది పెరిగి వృక్షమయ్యింది, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్నాయి.” మరల ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? అని అడిగి, అది ఒక స్త్రీ మూడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది” అని చెప్పారు. ఆ తర్వాత యేసు పట్టణాలు, గ్రామాల గుండా బోధిస్తూ, యెరూషలేముకు వెళ్లారు. అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రతీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే, చాలామంది ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కాని ప్రవేశించలేరు అని మీకు చెప్తున్నాను. ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మా కొరకు తలుపు తెరవండి’ అని వేడుకొంటారు. “కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు. “అప్పుడు మీరు, ‘మేము నీతో కలిసి తిన్నాము త్రాగాము, నీవు మా వీధుల్లో బోధించావు’ అని అంటారు. “కాని అతడు, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అంటాడు. “మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తలందరిని దేవుని రాజ్యంలో చూస్తారు, కానీ మీరు మాత్రం వెలుపటికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం, పండ్లు కొరకడం ఉంటాయి. ప్రజలు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి, దేవుని రాజ్యంలో జరిగే విందులో తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. వాస్తవానికి చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు.”

షేర్ చేయి
Read లూకా 13

లూకా 13:1-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కారని మీతో చెబుతున్నాను. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా? కానే కాదని మీతో చెబుతున్నా. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.” తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు. దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో, ‘మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గానీ నాకేమీ దొరకడం లేదు. దీన్ని నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి’ అన్నాడు. అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి, అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి’ అన్నాడు.” ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది. యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది. యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు. అందుకు ప్రభువు, “కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా. ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు. ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు. ఆయన ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చగలం? అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి.” మళ్ళీ ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి, దానిలో వేసే పుల్లని పిండిలాగా ఉంది” అన్నాడు. ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు. ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు. దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను. ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే ఆయన, ‘మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు’ అని మీతో అంటాడు. అప్పుడు మీరు, ‘నీ ఎదుటనే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా’ అంటారు. అప్పుడు ఆయన, ‘మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేసేవారు. నా దగ్గరనుంచి పొండి’ అంటాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు. ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు. ఇదిగో వినండి, చివరి వారు మొదటి వారవుతారు, అలాగే మొదటివారు చివరి వారవుతారు.”

షేర్ చేయి
Read లూకా 13

లూకా 13:1-30 పవిత్ర బైబిల్ (TERV)

ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని బలి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని” చెప్పారు. యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని మీ అభిప్రాయమా? నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి. గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా? నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.” ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒకడు తన ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి పండ్లు కనిపించలేదు. అతడు తోటమాలితో, ‘ఈ చెట్టుకు పండ్లు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొట్టేయి. అది అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది’ అని అన్నాడు. ఆ తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను. వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.” ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగి ఉంది. ఆమె చక్కగా నిలువలేకపోయేది. యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు విముక్తి కలిగించాను.” అని అంటూ ఆమె మీద తన చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది. విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవలసిన రోజున కాదు” అని అన్నాడు. యేసు, “మీరు కపటులు. విశ్రాంతి రోజు మీ ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి నీళ్ళు త్రాగించరా? ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు. ఈ మాటలు, ఆయన విరోధులు సిగ్గుపడేటట్లు చేశాయి. కాని ఆయన చేసిన మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు. ఆ తర్వాత యేసు, “దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? అది ఒక ఆవగింజ లాంటిది. దాన్ని ఒకడు తన తోటలో నాటాడు. అది పెరిగి చెట్టయింది. ఆకాశంలో ఎగిరే పక్షులు దాని కొమ్మల మీద వ్రాలాయి” అని అన్నాడు. యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?” అని అడిగి, “అది పిండిలో కలిపే పులుపు లాంటిది. ఒక స్త్రీ ఆ పులుపును మూడు కుంచాల పిండిలో ఆ పిండంతా పులిసేదాకా కలిపింది” అని సమాధానం చెప్పాడు. యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు. ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు. అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు. కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు. “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 13

లూకా 13:1-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను–ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందునవారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి నప్పుడు ఏమియు దొరకలేదు గనుక అతడు–ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. అయితే వాడు–అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము; అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను. విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్ర్తీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి–అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమెమీద చేతులుంచ గానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి–పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు–వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లు పెట్టును గదా. ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను. ఆయన–దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును? ఒక మనుష్యుడు తీసికొనిపోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించెననెను. మరల ఆయన–దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్ర్తీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను. ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును. అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 13