లూకా 12:15-21

లూకా 12:15-21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు. ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది. అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’ “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని నిల్వచేసుకొంటాను. నాతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీ కొరకు సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు. “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం తీయబడుతుంది. అప్పుడు నీ కొరకు నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’ “దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కొరకు సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు.

షేర్ చేయి
Read లూకా 12

లూకా 12:15-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.” తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది. అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు, ‘నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు. అయితే దేవుడు అతడితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?’ అని అతనితో అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు” అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 12

లూకా 12:15-21 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు. ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు. “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు. “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు. “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”

షేర్ చేయి
Read లూకా 12

లూకా 12:15-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు–నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని – నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో – ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 12