లూకా 12:1-5
లూకా 12:1-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అంతలో, వేలాదిమంది ప్రజలు ఒకరినొకరు త్రొక్కిసలాడుకొనేంతగా గుమికూడారు. అప్పుడు యేసు మొదట తన శిష్యులతో మాట్లాడడం ప్రారంభించారు: “వేషధారణ అనే పరిసయ్యుల పులిసిన పిండి మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి. దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. మీరు చీకట్లో మాట్లాడినవి పగటివేళలో వినబడతాయి. మీరు లోపలి గదుల్లో చెవిలో చెప్పిన మాటలు పైకప్పుల నుండి ప్రకటించబడతాయి. “నా స్నేహితులారా, నేను మీతో చెప్పేదేమంటే, మీ శరీరాన్ని చంపి, ఆ తర్వాత ఏమి చేయలేని వారికి భయపడకండి. మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను: మీ దేహం చంపబడిన తర్వాత, మిమ్మల్ని నరకంలో పడద్రోసే శక్తిగల వానికి భయపడండి. అవును, ఆయనకే భయపడండి.
లూకా 12:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు. “పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అంటే వారి వేషధారణ విషయం జాగ్రత్త పడండి. కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు. అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు. నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు. ఎవరికి మీరు భయపడాలో చెబుతాను. చంపిన తరువాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెబుతున్నాను.
లూకా 12:1-5 పవిత్ర బైబిల్ (TERV)
అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసు కోవటం మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడండి. బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు. చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి. “మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు. ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.
లూకా 12:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను–పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి. మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా– దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.