లూకా 10:33-37
లూకా 10:33-37 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఒక సమరయుడు, ప్రయాణం చేస్తూ, వాడు పడి ఉన్న చోటికి వచ్చాడు; అతడు వానిని చూసినప్పుడు, వాని మీద జాలిపడ్డాడు. అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకొనివెళ్ళి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. మరునాడు అతడు రెండు దేనారాలు తీసి ఆ సత్రపు యజమానికి ఇచ్చాడు. ‘ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, నీవు అధనంగా ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే, నేను మళ్ళీ వచ్చినప్పుడు దానిని తిరిగి చెల్లిస్తాను’ అని అతనితో చెప్పి వెళ్లాడు. “దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు?” అని అతన్ని అడిగారు. అందుకు ధర్మశాస్త్ర నిపుణుడు, “వాని పట్ల కనికరం చూపినవాడే” అని చెప్పాడు. యేసు అతనితో, “నీవు వెళ్లి అలాగే చెయ్యి” అన్నారు.
లూకా 10:33-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు. అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు. మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు. దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.
లూకా 10:33-37 పవిత్ర బైబిల్ (TERV)
“ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.” ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు. ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు. దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
లూకా 10:33-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు–అతనిమీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు–నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.